LOADING...
Todd Blanche: రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తాం: డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే
రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తాం: డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే

Todd Blanche: రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తాం: డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను శుక్రవారం న్యాయశాఖ బహిర్గతం చేసింది. అయితే ఈ పత్రాల విడుదల వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయంటూ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. డెమొక్రాట్ల నేతలను లక్ష్యంగా చేసుకునేలా పత్రాలు విడుదల చేశారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తొలి విడతగా విడుదల చేసిన నివేదికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలను తొలగించారనే ఆరోపణలపై బాధితులు, న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశాయి. శుక్రవారం విడుదలైన తొలి విడత పత్రాలు భారీగా సవరణలతో ఉన్నాయని, అందులో కొత్త సమాచారం చాలా తక్కువగానే ఉందని బాధితులు, న్యాయవాద సంఘాలతో పాటు పలువురు విమర్శకులు వ్యాఖ్యానించారు.

వివరాలు 

న్యాయశాఖ చట్టబద్ధంగానే వ్యవహరించింది 

ప్రజలు ఆశించిన స్థాయిలో వివరాలు లేవని, కీలక అంశాలను తొలగించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే శనివారం స్పందించారు. న్యాయశాఖ చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌కు సంబంధించిన ఫొటోలను తొలగించడాన్ని సమర్థించుకుంటూ, మాజీ అధ్యక్షుడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బాధిత న్యాయవాద సంఘాల అభ్యర్థన మేరకే పత్రాలను విడుదల చేశామని ఆయన వివరించారు. అదేవిధంగా ఆదివారం 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మాట్లాడిన టాడ్ బ్లాంచే, వచ్చే రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్‌ను కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. బాధితుల గోప్యత, భద్రత కోసమే పత్రాల్లో సవరణలు చేస్తున్నామని తెలిపారు.

వివరాలు 

ట్రంప్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు: టాడ్ బ్లాంచే

న్యాయశాఖ పూర్తిగా చట్ట పరిధిలోనే పనిచేస్తోందని ఆయన అన్నారు. విడుదలైన అన్ని పత్రాల్లో బాధితుల వివరాలు ఉన్నాయని, వారి అభ్యర్థన మేరకే కొన్ని చిత్రాలను తొలగించామని చెప్పారు. అయితే ట్రంప్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. బిల్ క్లింటన్‌పై దర్యాప్తు జరుగుతుందా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. శుక్రవారం విడుదలైన కొన్ని ఫొటోల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రముఖ గాయకుడు మైఖేల్ జాక్సన్ కనిపించారు. బిల్ క్లింటన్ ఒక గుర్తుతెలియని మహిళతో జలకాలాటలు ఆడుతున్నట్లు చిత్రాల్లో ఉంది. అలాగే జాకుజీలో అదే మహిళతో కలిసి ఉన్న ఫొటో కూడా బయటకు వచ్చింది.

Advertisement

వివరాలు 

తాజాగా విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్ క్లింటన్‌కు సంబంధించినవే..

అయితే ఆ ఫొటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారన్న వివరాలను పత్రాల్లో పేర్కొనలేదు. వాటిలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు కూడా లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్ క్లింటన్‌కు సంబంధించినవే ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధించిన చిత్రాలు మాత్రం కనిపించలేదు. ఇక లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఎప్‌స్టీన్ 2019 ఆగస్టులో మాన్‌హాటన్‌లోని ఫెడరల్ జైలులో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారికంగా నిర్ధారించారు.

Advertisement