NATO: నాటో నేతలకు ఎర్డోగాన్ వినూత్న కానుక.. గిఫ్ట్ బాక్స్‌లో తుపాకీ, తూటాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ సదస్సులు,శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనే దేశాధినేతలు పరస్పరం స్మారక కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఇటీవల జరిగిన నాటో (NATO) శిఖరాగ్ర సదస్సులో ఆతిథ్య దేశమైన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అందించిన బహుమతి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణ స్మారక చిహ్నం లేదా కళాఖండం స్థానంలో ప్రత్యేక చెక్క పెట్టెలో తుపాకీ, తూటాలను బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశమైంది. నాటో సదస్సుకు హాజరైన ప్రతి దేశాధినేతకు ప్రత్యేకంగా రూపొందించిన చెక్క బాక్స్‌ను అందించారు. ఆ పెట్టెలో వింటేజ్ శైలిలో తయారైన ఒక హ్యాండ్‌గన్‌తో పాటు ఆరు తూటాలు ఉంచారు. బాక్స్‌లోని ప్లకార్డుపై 'గుముసే.. మా దేశంలో తయారైన తొలి రివాల్వర్ తరహా హ్యాండ్‌గన్' అని పేర్కొన్నారు.
వివరాలు
హ్యాండ్‌గన్‌లపై తుర్కియే జాతీయ పతాకం,నాటో లోగో,దేశాధినేతల పేర్లు
అలాగే ఈ ఆయుధాన్ని ఎగుమతి నిబంధనల నుంచి మినహాయించినట్లు తెలిపే అధికారిక పత్రాన్ని కూడా అందులో జత చేశారు. ఈ ప్రత్యేక హ్యాండ్‌గన్‌లపై తుర్కియే జాతీయ పతాకం,నాటో లోగోతో పాటు ఆయా దేశాధినేతల పేర్లను ప్రత్యేకంగా చెక్కడం విశేషం. ఈ తరహా తుపాకులను 1990వ దశకంలో తుర్కియేకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఎంకేఈ(MKE) తయారు చేసినట్లు సమాచారం. ఈ బహుమతులను చూసిన పలువురు నేతలు మొదట ఆశ్చర్యానికి గురయ్యారు.బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారిగా ఈ గిఫ్ట్ వివరాలను వెల్లడించారు. తన పేరుతో ప్రత్యేకంగా చెక్కిన తుపాకీ, తూటాలను ఎర్డోగాన్ బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు.
వివరాలు
బహుమతులను వెంట తీసుకువెళ్లని కొందరు నేతలు
స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని తనకు అందిన హ్యాండ్‌గన్‌ను మీడియాకు చూపిస్తూ ఈ వినూత్న కానుక గురించి వివరించారు. అయితే భద్రతా, కస్టమ్స్ నిబంధనల కారణంగా కొందరు నేతలు ఈ బహుమతులను వెంట తీసుకెళ్లలేదు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, నెదర్లాండ్స్ ప్రధాని తమకు అందిన తుపాకులను అంకారాలోని తమ దేశ రాయబార కార్యాలయాల్లోనే భద్రపరిచారు. బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తనకు అందిన తుపాకీని బ్రస్సెల్స్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అవసరమైన అనుమతులు పూర్తయ్యాక తనకు అప్పగించాలని సూచించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తనకు అందిన హ్యాండ్‌గన్‌ను మిలిటరీ మ్యూజియంకు అందజేయనున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రభుత్వ గ్యాలరీలో భద్రపరిచిన ఇటలీ ప్రధాని
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దానిని ప్రభుత్వ గ్యాలరీలో భద్రపరిచారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాత్రం తుపాకీని వెంట తీసుకెళ్లి, బుల్లెట్లను అంకారాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉంచినట్లు సమాచారం. తుర్కియే రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, దేశీయంగా తయారైన ఆయుధాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఎర్డోగాన్ నాటో దేశాధినేతలకు ఈ ప్రత్యేక బహుమతులు అందించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.