Trump's Greenland gambit: గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ దూకుడు.. యూరోప్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్‌లాండ్ అంశం ఇప్పుడు మిత్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనను డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ ప్రయత్నాలకు మరింత వేగం పెంచినట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వెనిజులా వ్యవహారం తర్వాత ఇప్పుడు ట్రంప్ దృష్టి పూర్తిగా గ్రీన్‌లాండ్‌పైనే కేంద్రీకృతమైనట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం డెన్మార్క్ పరిపాలనలో ఉన్న గ్రీన్‌లాండ్ విషయంలో, డెన్మార్క్ నాటో సభ్యదేశం కావడంతో ట్రంప్ వైఖరిని యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే ఊరుకోబోమని యూరోప్ దేశాలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
వివరాలు
అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం
యూరోపియన్ దేశాల నుంచి ఎదురవుతున్న అడ్డంకులతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. 2026 ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా జూన్ 1 నుంచి ఆ సుంకాన్ని 25 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. అమెరికా భద్రతకు గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమని పేర్కొన్న ట్రంప్, ఆ విషయంలో ఒప్పందం కుదరకపోతే అవసరమైతే బలవంతపు చర్యలకు కూడా వెనకాడబోమని వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికాపై 93 బిలియన్ యూరోల మేర సుంకాలు
ట్రంప్ ప్రకటనలపై యూరోపియన్ దేశాలు, నాటో నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాధినేతలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో అత్యవసరంగా సమావేశమై ట్రంప్ నిర్ణయాలను ఖండించారు. యూరోపియన్ దేశాలపై ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికన్ కంపెనీలను యూరోపియన్ మార్కెట్ల నుంచి తప్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాపై 93 బిలియన్ యూరోల మేర సుంకాలు విధించే అంశాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ వారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ దేశాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గ్రీన్‌లాండ్ విషయంలో ఐక్యతగా నిలవాలని పిలుపునిచ్చిన మార్క్ రుట్టే
ఇక యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ట్రంప్‌కు ఫోన్ చేసి ఇటువంటి చర్యలు సరైనవికావని చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయాలు అట్లాంటిక్ సంబంధాలను అస్థిరపరిచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్టార్మర్ డానిష్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. గ్రీన్‌లాండ్ విషయంలో ఐక్యతగా నిలవాలని ఆయన పిలుపునిచ్చినట్లు సమాచారం. మొత్తం మీద గ్రీన్‌లాండ్ అంశం అగ్ర రాజ్యం అమెరికా-యూరోపియన్ దేశాల మధ్య పరోక్ష పోరాటానికి దారి తీస్తున్నట్లు పరిస్థితులు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.