Asylum: అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అనుసరిస్తున్న విధానాలనే ఇప్పుడు ఐరోపా సంఘం కూడా శరణార్థుల అంశంలో అమలు చేయడానికి ముందుకు వస్తోంది. భారత్ సహా మొత్తం ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల దరఖాస్తులను పరిమితంగా పరిశీలించాలనే నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకుంది. ఈ జాబితాలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కొలంబియా, ఈజిప్ట్, కొసావో, మొరాకో, ట్యునీషియా దేశాలు ఉన్నాయి. వీటిని 'సురక్షిత దేశాలు'గా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐరోపా స్పష్టం చేసింది. అయితే ఈ చర్యపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాయుధ ఘర్షణలు ఉన్నప్పటికీ, విచక్షణలేని హింస విస్తృతంగా జరగని దేశాలను సురక్షిత దేశాలుగా తాము పరిగణిస్తున్నామని ఐరోపా అధికారులు తెలిపారు.
వివరాలు
భవిష్యత్తులో మరిన్ని దేశాలకు దీనిని విస్తరించే అవకాశం
ఈ అంశంపై యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ మధ్య కుదిరిన ఒప్పంద వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ నిబంధనలు తమకు వర్తించవని భావించే శరణార్థులు, దాన్ని తామే నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2026 జూన్ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు దీనిని విస్తరించే అవకాశముంది. ఒకసారి ఈ విధానం అమలులోకి వస్తే, ఆయా దేశాలు సురక్షితమైనవిగా తేలితే, శరణార్థులను తిరిగి వారి స్వదేశాలకు పంపే అవకాశం ఉంటుంది. అయితే శారీరక హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు.
వివరాలు
శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాలపరిమితి తగ్గింపు
ఇదే సమయంలో వలసదారులపై కఠిన వైఖరితో ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాలపరిమితిని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, అలాగే గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (EAD) ద్వారా అనుమతులు ఇస్తారు. ఇప్పటివరకు ఈ అనుమతులు ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవి. తాజా సవరణలతో ఆ కాలవ్యవధిని 18 నెలలకు తగ్గించారు. భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.