Loading...
Europe erupts: ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం.. యూరప్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం.. యూరప్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Europe erupts: ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం.. యూరప్‌లో ఉద్రిక్త పరిస్థితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌లో పెరుగుతున్న జీవన వ్యయాలు, ఇళ్ల అద్దెలు, విద్యా సంస్కరణలు, ప్రభుత్వ సేవలపై అసంతృప్తి ప్రజా నిరసనలకు దారితీస్తోంది. ఫ్రాన్స్‌లో మొదలైన ఆందోళనలు ఇటలీ, బెల్జియం, పోర్చుగల్ దేశాలకూ విస్తరించాయి. మరోవైపు అల్బేనియాలో అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, విద్యా ప్రమాణాలపై అసంతృప్తితో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పలు చోట్ల శాంతియుతంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

వివరాలు 

ఫ్రాన్స్‌లో తీవ్రరూపం దాల్చిన నిరసనలు.. 2,400 మంది అరెస్ట్

ఫ్రాన్స్‌లో విద్యా బడ్జెట్ తగ్గింపులు,పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థులు,కార్మిక సంఘాలు నిరసనలు ప్రారంభించాయి.

పెరుగుతున్న ధరలు, అసమానతలు, ప్రభుత్వ సేవల క్షీణతపై ఆగ్రహం కూడా దీనికి తోడైంది.

అక్టోబర్ 17న దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

పారిస్‌లోనే దాదాపు 1.1 లక్షల మంది ర్యాలీ నిర్వహించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు దుకాణాలను ధ్వంసం చేయడం, దోపిడీలకు పాల్పడటం, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

లిమోజెస్‌లో టౌన్‌హాల్ గడియారపు గోపురం అగ్నికి ఆహుతైంది.

ఫ్రాన్స్ అంతటా 2,400 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ వెల్లడించారు.

వివరాలు 

ఇటలీ, బెల్జియంలోనూ ధరల సెగ..

పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. దేశ అప్పులు, బడ్జెట్ లోటు పెరుగుతుండటం, ఖర్చుల తగ్గింపుతో సామాన్యులపై భారం పడుతుందన్న భయాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

ఇటలీలో మిలాన్, బొలోనియా, టూరిన్ సహా పలు నగరాల్లో ధరలు, గృహ ఖర్చులు, ప్రభుత్వ సేవలపై నిరసనలు జరిగాయి.

మిలాన్‌లో ఆందోళనకారులు దుకాణాల అద్దాలు పగులగొట్టడంతో పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.

హింసను ఖండించిన ప్రధాని జార్జియా మెలోనీ పరిస్థితిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విద్యా ఖర్చులు, ప్రతిపాదిత సంస్కరణలకు వ్యతిరేకంగా యువత నిరసన తెలిపింది.

అక్కడా పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

అల్బేనియాలో ప్రధాని రాజీనామాకు డిమాండ్

పోర్చుగల్‌లో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అద్దెలకు వ్యతిరేకంగా లిస్బన్‌లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు.

2017 నుంచి ఇళ్ల ధరలు రెట్టింపునకు పైగా పెరగడం, నిత్యావసరాల ఖర్చులు భారంగా మారడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

సెప్టెంబరులో ద్రవ్యోల్బణం 3.6 శాతానికి చేరింది. మరోవైపు అల్బేనియాలో ప్రధాని ఈడి రామా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

అవినీతి ఆరోపణలు, ఉపాధి అవకాశాల కొరత వీటికి ప్రధాన కారణాలు. ప్రభుత్వ భవనాల వద్ద ఘర్షణలు జరగడంతో పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.

ADVERTISEMENT

వివరాలు 

పరిష్కారం చూపకపోతే ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం

మొత్తంగా.. ఈ దేశాల్లో నిరసనలకు కారణాలు వేర్వేరైనా, పెరుగుతున్న జీవన వ్యయం, గృహ సంక్షోభం, విద్యా సమస్యలు, ప్రభుత్వాలపై విశ్వాసం తగ్గడం ఉమ్మడి అంశాలుగా కనిపిస్తున్నాయి.

పోలీసు చర్యలతో తాత్కాలికంగా పరిస్థితిని అదుపు చేయగలిగినా, ప్రజల ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపకపోతే ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT