Loading...
Europe: మండుతున్న ఐరోపా.. అల్బేనియా నుంచి ఫ్రాన్స్‌ వరకు నిరసనల సెగ!
మండుతున్న ఐరోపా.. అల్బేనియా నుంచి ఫ్రాన్స్‌ వరకు నిరసనల సెగ!

Europe: మండుతున్న ఐరోపా.. అల్బేనియా నుంచి ఫ్రాన్స్‌ వరకు నిరసనల సెగ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపా దేశాల్లో నిరసనల జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అల్బేనియా నుంచి ఫ్రాన్స్‌ వరకు విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక వసతుల కొరత, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఎల్‌నినో ప్రభావం, డీజిల్‌ కొరత వంటి సమస్యలు ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐరోపాలో ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంతో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు కూడా జీవన వ్యయాలు పెరగడం తీవ్ర భారంగా మారింది. అల్బేనియా, బెల్జియం, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, గ్రీస్‌, ఐర్లాండ్‌, పోర్చుగల్‌, బ్రిటన్‌, జర్మనీ, ఎస్తోనియా, హంగరీ, మాల్డోవా సహా పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

వివరాలు

అల్బేనియాలో నిరుద్యోగం.. విద్యార్థుల ఆందోళనలు

దాదాపు ప్రతి దేశంలోనూ ఇళ్ల ధరలు, అద్దెల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అల్బేనియాలో విద్యా వ్యయం పెరగడం, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉండటం, ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలపై వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

ఈ ఆందోళనలు ఇటీవల తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వివరాలు

బెల్జియంలో సామాజిక అసమానతలపై నిరసనలు

బెల్జియంలో పెరుగుతున్న సామాజిక అసమానతలు, విద్యారంగానికి నిధుల కొరత, ట్యూషన్‌ ఫీజుల పెరుగుదల, ప్రజా రవాణా ఖర్చులు, దుర్భరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.

వారికి కార్మికులు, తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు.

శనివారం జరిగిన నిరసనల సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతోపాటు జల ఫిరంగులను ఉపయోగించారు.

ADVERTISEMENT

వివరాలు

స్పెయిన్‌లో ఇళ్ల సమస్య.. ధరల పెరుగుదల

స్పెయిన్‌లో పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, గృహాల ధరలు, జీవన వ్యయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇల్లు అనేది కనీస అవసరంగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్‌ ప్రధాని శాంచెజ్‌ కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించారు.

అయితే వాటిని పార్లమెంటు తిరస్కరించింది. దీంతో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహించాలని ప్రధాని శాంచెజ్‌ నిర్ణయించారు.

స్పెయిన్‌లో సుమారు 7,50,000 ఇళ్ల కొరత ఉందని ఓ నివేదిక వెల్లడించింది. గృహాల కొరత, అద్దెల పెరుగుదల అక్కడి ప్రజలకు ప్రధాన సమస్యలుగా మారాయి.

ADVERTISEMENT

వివరాలు

ఇటలీ, గ్రీస్‌లోనూ ఆందోళనలు

ఇటలీలో హైస్కూల్‌ విద్యార్థులు పాఠశాలలను ఆక్రమించడం, నిరసన ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యారంగానికి నిధుల కేటాయింపులో కొరత, జీవన వ్యయాల పెరుగుదలపై వారు నిరసనలు తెలుపుతున్నారు.

గ్రీస్‌లోనూ ప్రభుత్వ విద్యకు నిధుల కొరత, పెరుగుతున్న జీవన వ్యయాలపై ఆందోళనలు జరుగుతున్నాయి.

ఇళ్ల అద్దెలు, గృహాల ధరలు పెరగడం అక్కడి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నిరసనలకు దిగుతున్నారు.

వివరాలు

ఐర్లాండ్‌లో నిత్యావసరాల బిల్లుల భారం

అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటిగా పేరొందిన ఐర్లాండ్‌లో ఇళ్ల అద్దెలు, యుటిలిటీ సేవలు, ఆరోగ్య సేవల ఖర్చులు భారీగా పెరిగాయి.

దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి నిత్యావసరాల బిల్లులను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.

వివరాలు

పోర్చుగల్‌లో అందని ఇళ్లు.. పడిపోతున్న జీవన ప్రమాణాలు

పోర్చుగల్‌లోని లిస్బన్‌ వంటి ప్రధాన నగరాల్లో ప్రజల ఆదాయానికి, ఇళ్ల అద్దెలకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది.

గృహాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా స్థానిక కార్మికులు తమ ఆదాయంతో కనీస అవసరాలను తీర్చుకోవడం కష్టంగా మారింది.

జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితులు ప్రజా ఆందోళనలకు దారితీస్తున్నాయి.

బ్రిటన్‌లో ఆహార ధరల మంట

గత రెండు దశాబ్దాలుగా ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, అదే సమయంలో ఆహార ధరలు భారీగా పెరగడం బ్రిటన్‌లో కోట్లాది మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది.

నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం పెరగడంతో కుటుంబాలపై ఒత్తిడి అధికమవుతోంది.

వివరాలు

జర్మనీ, నార్డిక్‌ దేశాల్లోనూ ధరల ప్రభావం

జర్మనీతోపాటు నార్డిక్‌ దేశాలైన నార్వే, స్వీడన్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌లలోనూ ప్రజలు జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ దేశాల్లో ప్రభుత్వాల నుంచి సామాజిక మద్దతు అందుతున్నప్పటికీ, సగటు వేతనాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఇళ్ల ధరలు, ఆహారం, ఇంధన ఖర్చులు పెరగడం ప్రజలపై భారంగా మారింది. అధిక పన్నులు కూడా వారి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.

వివరాలు

ఎస్తోనియా, హంగరీ, మాల్డోవాల్లో నిత్యావసరాల ధరల సెగ

ఎస్తోనియా, హంగరీ, మాల్డోవాల్లో ఆహారం, ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ దేశాల్లో దిగుమతి వ్యయాలు భారీగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

ఫలితంగా సామాన్య ప్రజల జీవన వ్యయాలు మరింత అధికమవుతున్నాయి.

వివరాలు

ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పారిస్‌లో ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఆందోళనకారులు కార్లకు నిప్పంటించడంతోపాటు దుకాణాలను దోచుకున్నారు.

పారిస్‌ నగర కేంద్రానికి సమీపంలోని 'ప్లాస్‌ దె లా రిపుబ్లిక్‌' (Place de la République) వద్ద జరిగిన ప్రదర్శనలో నిరసనకారులు అధికారులపై బాణాసంచా, రాళ్లు, ఇతర వస్తువులు విసిరారు.

దీంతో ఆందోళనకారులను వెనక్కి నెట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. జల ఫిరంగులను కూడా ఉపయోగించారు.

వివరాలు

272 మంది అరెస్టు

ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కనీసం 272 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మొత్తంగా ఐరోపాలోని పలు దేశాల్లో విద్య, నిరుద్యోగం, గృహాల కొరత, ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, పెరుగుతున్న జీవన వ్యయాలు నిరసనలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఆయా దేశాల్లో ప్రజల ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి ఈ ఆందోళనలతో స్పష్టమవుతోంది.

ADVERTISEMENT