LOADING...
Iran-Israel: ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు
ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు

Iran-Israel: ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం కొంత ఊపిరి పీల్చుకుంది. చమురు ధరలు, గ్లోబల్ మార్కెట్లు కూడా కొంత స్థిరపడ్డాయి. అయితే యుద్ధం విషయంలో అమెరికా వెనక్కి తగ్గిన సంకేతాలు కనిపించినప్పటికీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం.

వివరాలు

ఇజ్రాయెల్‌పై 78వ విడత దాడులు

ఇజ్రాయెల్‌పై 78వ విడత దాడులను ప్రారంభించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. డిమోనా, టెల్ అవీవ్, ఇలాట్ ప్రాంతాలతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ల దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్లు తెలిపింది. తెల్లవారుజామునుంచి దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి.

వివరాలు

ఇరాన్ గ్యాస్ స్థావరాలపై దాడులు

ఇక మరోవైపు ఇరాన్‌లోని గ్యాస్, విద్యుత్ మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయి. ఇస్ఫహాన్లోని గ్యాస్ వ్యవస్థ, ఖొర్రమ్‌షహర్లోని పవర్ ప్లాంట్‌పై క్షిపణులు, డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడులకు బాధ్యులు ఎవరన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఇది ఇజ్రాయెల్ పని కావచ్చని ఇరాన్ ఆరోపిస్తోంది. ట్రంప్ విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకోవడం పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.

Advertisement

వివరాలు

హర్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన

ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. అధికారులతో సమన్వయం చేసుకుంటూ తటస్థ దేశాల నౌకలు ఈ మార్గంలో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. తమ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపై దాడులు జరిగితే మాత్రం తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, తాజా పరిణామాలపై స్పందించిన ఓ అమెరికా అధికారి, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మాత్రమే తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.

Advertisement