COVID 19: వుహాన్ ల్యాబ్ పరిశోధనలకు అమెరికా గ్రాంట్లు.. మోరెన్స్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కొవిడ్ పుట్టుకపై మరోసారి కీలక చర్చ మొదలైంది. కరోనా వైరస్ పరిశోధనలకు అమెరికా నుంచి నిధులు అందినట్లు, వాటికి సంబంధించిన కొన్ని రికార్డులను అధికారిక వ్యవస్థకు బదులుగా వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాల్లో భద్రపరిచినట్లు అమెరికా మాజీ అధికారి డేవిడ్ మోరెన్స్ అంగీకరించినట్లు సమాచారం. అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వద్ద మోరెన్స్ సలహాదారుగా పనిచేశారు. కొవిడ్ పరిశోధనలకు సంబంధించిన గ్రాంట్లపై 2020 ఏప్రిల్ నుంచి ప్రభుత్వ సంస్థకు అందిన ప్రజా రికార్డుల అభ్యర్థనలను అడ్డుకున్నారన్న ఆరోపణలు మోరెన్స్‌పై ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నించగా, తాను చేసిన తప్పును ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
వివరాలు
వుహాన్ ల్యాబ్ గ్రాంట్ పునరుద్ధరణకు మోరెన్స్ హామీ?
మహమ్మారి ప్రారంభమైన సమయంలో ఫౌచీ 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్' (NIAID)కు అధిపతిగా ఉన్నారని,తాను ఆయనకు సహాయకుడిగా పనిచేశానని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మోరెన్స్ వెల్లడించారు.
ఈ కేసులో నేరం రుజువైతే గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా,చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచే కొవిడ్-19 బయటకు వచ్చిందన్న ఆరోపణలు గతంలోనే తెరపైకి వచ్చాయి.
ఆ సమయంలో గబ్బిలాల్లో కనిపించే కరోనా వైరస్‌లపై పరిశోధనలకు అందుతున్న గ్రాంటును నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH)రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
అయితే ఆ గ్రాంటును తిరిగి పొందేందుకు మోరెన్స్ చైనా ల్యాబ్ యాజమాన్యానికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు వారు ఆరోపించారు.
వివరాలు
కొవిడ్ మూలాలపై కీలక ఆరోపణలు.. ఫౌచీ విచారణకు అవకాశం
ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న వాదనను తప్పుదోవ పట్టించే అంశంగా చూపిస్తూ, కరోనా సహజసిద్ధంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందన్న సిద్ధాంతానికి మద్దతుగా ప్రచారం జరిగేలా సహకరించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ప్రభుత్వ అధికారిక ఈ-మెయిల్ ఖాతాలను కాకుండా మోరెన్స్ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామని వారు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
వివరాలు
కొవిడ్ మూలాలపై తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు
కరోనా వైరస్ మూలాలపై అమెరికాలో ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి.
చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో ప్రమాదకర పరిశోధనలు నిర్వహించేందుకు అమెరికా నుంచి నిధులు అందాయని, వైరస్ పుట్టుకకు సంబంధించిన వాస్తవాలను అమెరికా ఉన్నతస్థాయి వ్యక్తులు దాచిపెట్టారని అమెరికా మాజీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్ జూన్‌లో ఆరోపించారు.
ఈ వ్యవహారం వెనుక కీలక వ్యక్తిగా అప్పటి బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీని ఆమె పేర్కొన్నారు.