Sheikh Hasina: స్వదేశానికి వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరుతూ భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. 2024లో అధికారాన్ని కోల్పోయి దేశం విడిచివచ్చిన తర్వాత ఆమె నుంచి ఈ తరహా విజ్ఞప్తి రావడం ఇదే తొలిసారి. డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని హసీనా భావిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. రెండేళ్లకు పైగా క్రితం విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక ఉద్యమం కారణంగా ఆమె అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
వివరాలు
హసీనా విజ్ఞప్తిపై ఇంకా స్పందించని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం
లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థలో పనిచేస్తున్న హసీనా న్యాయవాదులు.. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహమాన్‌కు లేఖ రాశారు.
బంగ్లాదేశ్ పౌరసత్వం, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల ఆధారంగా ఆమె పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి ఆమోదించాలని కోరారు.
అయితే ఈ విజ్ఞప్తిపై ప్రీతి రెహమాన్ నుంచి గానీ, ఢాకాలోని ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రతినిధుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
వివరాలు
బంగ్లాదేశ్‌లో హసీనాకు ఇంకా మద్దతు
అధికారాన్ని కోల్పోయే ముందు బంగ్లాదేశ్‌లో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండేది.
అయితే ఆమె పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పార్టీపై నిషేధం విధించారు.
పార్టీకి చెందిన పలువురు నేతలు జైళ్లలో ఉండగా.. మరికొందరు భారత్‌తో పాటు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు.
అయినప్పటికీ బంగ్లాదేశ్‌లోని కొన్ని వర్గాల ప్రజల్లో హసీనాకు ఇప్పటికీ మద్దతు ఉంది.
ఆమె తిరిగి వస్తే దేశంలో రాజకీయ విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వివరాలు
గతేడాది హసీనాకు మరణశిక్ష
విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆదేశాలిచ్చి, పలువురి మరణాలకు కారణమయ్యారనే ఆరోపణలతో బంగ్లాదేశ్ యుద్ధ నేరాల న్యాయస్థానం గతేడాది నవంబరులో హసీనాకు ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది.
అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నప్పటికీ స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
బంగ్లాదేశ్ చేరుకున్న వెంటనే న్యాయస్థానం ముందు లొంగిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లడం వల్ల భారత్-బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.