Ex-CIA Spy: ఇరాన్ అణ్వాయుధాల వెనుక ఏక్యూ ఖాన్ హస్తం..: సీఐఏ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ అణు బాంబు రూపకర్తగా ప్రఖ్యాతి గాంచిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) నడిపిన న్యూక్లియర్ స్మగ్లింగ్ వ్యవస్థను అమెరికా ఎన్నో సంవత్సరాల క్రితమే అణిచివేసింది. ఆ ఆపరేషన్‌లో ముఖ్యపాత్ర పోషించిన సీఐఏ మాజీ అధికారి జేమ్స్ లాలెర్ ఇప్పుడు కొన్ని సంచలన సమాచారాన్ని వెలుగు లోకి తెచ్చారు. అణు సాంకేతికతను ఏక్యూ ఖాన్ బహిరంగంగా అమ్మకానికి పెట్టాడని లాలెర్ వ్యాఖ్యానిస్తూ, అతడిని 'మరణం అమ్మే వ్యాపారి'తో పోల్చారు. అంతేకాదు, ఖాన్ ప్రభావం కింద పాకిస్థాన్ జనరల్స్, కొన్ని రాజకీయ నాయకులు కూడా అతడికి కూలీలుగా పనిచేశారని విమర్శించారు.
వివరాలు
సాంకేతిక సహాయంతోనే ఇరాన్ తన అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకుంది
జాతీయ మీడియా సంస్థ 'ఏఎన్ఐ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాలెర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ''పాకిస్థాన్ అణు కార్యక్రమంలో ఏక్యూ ఖాన్ ఎలా వ్యవహరిస్తున్నాడో అమెరికా ఎప్పుడూ గమనిస్తోంది. కానీ అతడి స్మగ్లింగ్ వలయాన్ని గుర్తించడానికి చాలా కాలం పట్టింది. ఖాన్ అణు టెక్నాలజీని మార్కెట్లో పెట్టి విక్రయిస్తాడని మేమెప్పుడూ ఊహించలేదు. అతడు కేవలం సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీనే కాదు, బాలిస్టిక్ క్షిపణుల డిజైన్‌లు, చైనా అణు బాంబు బ్లూప్రింట్లను కూడా ఇతర దేశాలకు అందించాడు. ఆయన ఇచ్చిన సాంకేతిక సహాయంతోనే ఇరాన్ తన అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకుంది'' అని లాలెర్ తెలిపారు.