Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష
తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు. అయితే మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్‌కు వీఐపీ సౌకర్యాలు ఏవీ కల్పించడం లేదు. పైగా ఇమ్రాన్ ఖాన్‌ను చిన్నపాటి సెల్‌లో ఏకాంతంగా ఉంటారట. ఆ సెల్‌లో కనీసం బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదని ఇమ్రాన్ సహాయకుడు సల్మాన్ హైదర్ చెప్పారు. ఇమ్రాన్ బ్యారక్ చాలా ఇరుకుగా ఉంటుందని, అతనికి స్నానం చేయడానికి, ఇతర అవసరాల కోసం నీళ్లను కూడా బయట నుంచి బకెట్‍లో తెచ్చుకోవాలని హైదర్ అన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి న్యాయవాదులను అనుమతించడం లేదు: హైదర్
ఇమ్రాన్ ఖాన్ సెల్ దగ్గర సిబ్బంది ఎవరిని నియమించలేదని, అందుకే అతను ఎవరితో మాట్లాడే అవకాశం లేదని హైదర్ చెప్పారు. మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్‌కు ఆయన హోదాకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించాలని ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను పాటించడం లేదని హైదర్ పేర్కొన్నారు. కనీసం వార్తాపత్రికలు, పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. హైకోర్టు నిర్ణయాన్ని పూర్తిగా ధిక్కరిస్తూ ఖాన్‌ను కలవడానికి న్యాయవాదులను కూడా అనుమతించడం లేదని హైదర్ వివరించారు. ఇలాంటి పనులు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. ఇమ్రాన్‌పై అణచివేత,హింసపై మౌనం వహించవద్దని తాను అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థిస్తున్నట్లు హైదర్ పిలుపునిచ్చారు.