Balendra Shah: నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. దేశ నూతన ప్రధానమంత్రిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ నేత బాలేంద్ర షా (బాలేన్ షా) బాధ్యతలు చేపట్టారు. ఈరోజు అధ్యక్ష భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలేన్ షాను ప్రధానిగా నియమించారు. కేవలం 35 ఏళ్ల వయసులో ఈ బాధ్యతలు స్వీకరించిన ఆయన, దేశ 47వ ప్రధానమంత్రిగా అరుదైన రికార్డు నమోదు చేశారు.
వివరాలు
వైభవంగా ప్రమాణ స్వీకారం
హిందూ, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనంగా బాలేన్ షా ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రారంభానికి సంకేతంగా ఏడుగురు కళాకారులు శంఖనాదం చేయగా, 108 మంది వేద పండితులు స్వస్తి శాంతి మంత్రాలు పఠించారు. అదే సమయంలో 16 మంది బౌద్ధ భిక్షువులు అష్టమంగళ మంత్రాలను ఉచ్ఛరించారు. ఈ వేడుక సంప్రదాయాల సమన్వయానికి ప్రతీకగా నిలిచింది. ఎన్నికల్లో సంచలన విజయం ఈ నెల 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలేన్ షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. మొత్తం 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకుని మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువైంది.
వివరాలు
ఓలీపై భారీ మెజారిటీ
ఎన్నికల ప్రచారంలోనే బాలేన్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ, గురువారం జరిగిన సమావేశంలో ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఆయన ప్రధాని అవడం ఖరారైంది. ఝాపా-5 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలేన్ షా, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. బాలేన్‌కు 68,348 ఓట్లు రాగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 49,614 ఓట్ల తేడాతో గెలిచిన ఆయన, 1991 తర్వాత నేపాల్ ఎన్నికల చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు.
వివరాలు
ఇంజినీర్ నుంచి ప్రధాని వరకూ
1990లో ఖాట్మండులో మధేశీ కుటుంబంలో జన్మించిన బాలేన్ షా, భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2022లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండు మేయర్‌గా గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే యువతలో విపరీతమైన ఆదరణ పొందారు. తరం మార్పుకు సంకేతం బాలేన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం నేపాల్ రాజకీయాల్లో తరం మార్పుకు సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ నాయకత్వం ముందుకు రావడంలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.