USA: అమెరికా వీసా పరిమితుల విధానం కొనసాగింపు.. జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా ఉన్న వారిపై చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వీసాలపై వరుసగా కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం తాజాగా తన పరిమితుల విధానాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న నియంత్రణలను కొనసాగిస్తూ, వాటిని మరికొన్ని దేశాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కెనడా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా దేశాల్లో కూడా వీసా పరిమితులను అమలు చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం భాగంగా ఇప్పటికే 26 మంది విదేశీయులపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా శత్రు దేశాలకు అనుకూలంగా పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
వివరాలు
జాతీయ భద్రత, సమగ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి
దేశంలోని వ్యూహాత్మకంగా కీలకమైన వనరులు, ఆస్తులు శత్రు శక్తుల చేతికి చిక్కకుండా కాపాడడం తమ ప్రధాన ఉద్దేశమని విదేశాంగ శాఖ పేర్కొంది. అలాగే దేశ ప్రజల సంక్షేమం, జాతీయ భద్రత, సమగ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించింది. ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించడం, ప్రాంతీయ భద్రతను దెబ్బతీయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనే విదేశీయులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అమెరికాలో ప్రవేశం నిషేధిస్తామని స్పష్టం చేసింది.