Ukraine: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌లో పేలుళ్లు.. ఉక్రెయిన్‌లో ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో భేటీ కానున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురు కీలకంగా చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందు శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం ఆందోళనకు దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్ వైమానిక దళం దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది. నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ 20 పాయింట్ల ప్రణాళికతో ఆదివారం ట్రంప్‌ను కలవనున్నారు. ఉక్రెయిన్ భద్రత అంశమే ప్రధానంగా ఈ చర్చల్లో ఉండనుంది. ఇలాంటి కీలక తరుణంలో కీవ్‌లో బాంబు పేలుళ్లు జరగడం పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుందేమోనన్న ఆందోళనను పెంచుతోంది.
Details
నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు తగ్గుముఖం పట్టినా, ఈ యుద్ధం మాత్రం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా-రష్యా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ట్రంప్ 28 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ స్వయంగా రంగంలోకి దిగి, ఈ ప్రణాళికపై జెలెన్‌స్కీ, పుతిన్‌లతో చర్చలు జరిపారు.
Details
ఫ్లోరిడాలో ట్రంప్ ను కలవనున్న జెలెన్‌స్కీ
పుతిన్ దీనిపై సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ, జెలెన్‌స్కీ మాత్రం తిరస్కరించారు. దీంతో శాంతి ఒప్పందం ఆశలు మొదటికొచ్చాయి. ఇటీవల జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఫ్లోరిడాలో ట్రంప్‌ను కలవనున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో 20 పాయింట్ల ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలపై చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో అమెరికా, ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా దేశాలు కూడా పాల్గొనాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇంత తక్కువ సమయంలో అది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ట్రంప్ నుంచి ఉక్రెయిన్‌కు స్పష్టమైన భద్రతా హామీలు లభిస్తే, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.