'Extreme situation': ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్.. అత్యంత తీవ్రమైన పరిస్థితి..
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ సైనికులు తీవ్ర ఆకలి, దాహంతో అలమటిస్తున్న ఫోటోలు గురువారం (ఏప్రిల్ 3) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెటా సంస్థకు చెందిన థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో 'i.petrovna' అనే అకౌంట్ ఈ చిత్రాలను పోస్టు చేసింది. అందులో కనిపించిన ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు ఎముకలు మాత్రమే మిగిలినట్టుగా, శరీరం పూర్తిగా క్షీణించిన స్థితిలో కనిపించారు. వారి పక్కటెముకలు స్పష్టంగా బయటకు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లు రెండు నెలలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేవలం 24 గంటల్లోనే ఈ పోస్టుకు 29 వేలకుపైగా లైక్స్, 2.8 వేలకుపైగా రీషేర్లు వచ్చాయి.
వివరాలు
ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు..
ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ అత్యవసరంగా స్పందించింది. ఇది "అత్యంత తీవ్రమైన పరిస్థితి" అని పేర్కొంది. థ్రెడ్స్ పోస్టుకు స్పందిస్తూ, "లాజిస్టిక్స్ సమస్యలు క్లిష్టంగా ఉన్నాయి" అని తెలిపింది. అయితే నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది భయంకరమైన పరిస్థితి", "మన అధికార వ్యవస్థ ఎక్కడ ఉంది?" అంటూ ప్రశ్నించారు. థ్రెడ్స్‌లో అనామక అకౌంట్ ద్వారా పోస్టు చేసిన ఈ చిత్రాల్లో ఉక్రెయిన్ 14వ ప్రత్యేక మెకనైజ్డ్ బ్రిగేడ్‌కు చెందిన 2వ మెకనైజ్డ్ బెటాలియన్ సైనికులు కనిపించినట్లు చెబుతున్నారు. వారంతా బాగా క్షీణించి, కళ్లలో నీరసం, శరీరంలో బలహీనతతో కనిపించారు.
వివరాలు
నీరు, ఆహారం లేకుండా పస్తులు..
ఆ పోస్టులో పరిస్థితిని వివరంగా వెల్లడించారు. "సైనికులు స్థానాల్లో ఆహారం, నీరు లేకుండా ఉన్నారు. కమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆకలితో యోధులు స్పృహ తప్పుతున్నారు. వర్షపు నీళ్లు తాగుతున్నారు. కమ్యూనికేషన్‌లో కూడా సమస్యలు ఉన్నాయి" అని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టు వేగంగా వ్యాపించడంతో పలు సోషల్ మీడియా వేదికల్లో ఆందోళన వ్యక్తమైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. భద్రతా కారణాల వల్ల ఆ యూనిట్ ఖచ్చితమైన స్థానం వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 19న విడుదలైన బ్రిగేడ్ అప్‌డేట్ ప్రకారం, ఆ దళాల్లో కొంతమంది ఖార్కివ్ ప్రాంతంలో, ముఖ్యంగా కుప్యాన్స్క్ సెక్టార్ సమీపంలో పనిచేస్తున్న అవకాశముందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా తీవ్ర యుద్ధం కొనసాగుతోంది.