Iran: ఇరాన్‌లో ఘోర బొగ్గు గని ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తబాస్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 30 మంది కార్మికులు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం శనివారం అర్థరాత్రి జరిగింది. టెహరాన్‌కు 540 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ బొగ్గు గనిలో 70 మంది పనిలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల 30 మంది మరణించగా, మరో 24 మంది గని లోపల చిక్కుకున్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయమందిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.