Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం.. టూరిస్టులతో సహా 12 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కెన్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున క్యాలే కౌంటీలోని డయాని నుండి కిచ్వా టెంబోకు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పర్యాటకులతో సహా 12 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (KCAA) ఈ ఘటనను ధృవీకరించింది. ప్రమాదానికి గురైన విమానం రిజిస్ట్రేషన్ నంబర్ 5Y-CCAగా గుర్తించారు. ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.
Details
సహాయక చర్యలు ప్రారంభం
ప్రభుత్వ సంస్థలు, అత్యవసర సేవా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా పైలట్ విమానాన్ని ముందుకు సాగించినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. పొగమంచు మరియు గాలిలో దట్టమైన మేఘాలు ఉండటం వల్ల పైలట్‌కు విజిబిలిటీ తగ్గి నియంత్రణ కోల్పోయిన అవకాశం ఉందని కూడా స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కెన్యా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి దర్యాప్తు కొనసాగుతోంది.