Glucose monitor: గ్లూకోజ్ మానిటర్లపై FDA హెచ్చరికలు.. అబాట్ పరికరాల్లో లోపాలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్లూకోజ్ మానిటర్‌ల అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. అబాట్ డయాబెటిస్ కేర్ సంస్థ తయారు చేసిన కొన్ని గ్లూకోజ్ మానిటర్లు సరిగా పనిచేయకపోవడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ పరికరాల వల్ల ఏడుగురు మృతి చెందగా, వందల మంది గాయాలపాలైనట్లు పేర్కొంది. ప్రజలు వీటి వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. ముఖ్యంగా ఫ్రీస్టైల్ లిబ్రే 3, ఫ్రీస్టైల్ లిబ్రే 3 ప్లస్ మోడళ్లలో తప్పుదారి చూపే రీడింగ్‌లు వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరించింది. ఈ లోపం కారణంగా సుమారు 30 లక్షల పరికరాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అబాట్ సంస్థ నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ సమస్య బయటపడినట్లు వెల్లడించింది.
వివరాలు
మొత్తం 736 ప్రతికూల ఘటనలపై ఫిర్యాదులు
నవంబర్ వరకు ఈ మానిటర్‌ల వినియోగానికి సంబంధించి మొత్తం 736 ప్రతికూల ఘటనలపై ఫిర్యాదులు అందినట్లు అబాట్ పేర్కొంది. ఇందులో 57 కేసులు అమెరికాలోనే నమోదైనట్లు తెలిపింది. అమెరికా వెలుపల ఏడు మంది మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించింది. సమస్యకు అసలు కారణాన్ని ఇప్పటికే గుర్తించామని, ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న వినియోగదారులకు తగిన పరిష్కారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని అబాట్ వెల్లడించింది.