LOADING...
UFC Event: ట్రంప్‌ కార్యక్రమంపై డ్రోన్లతో దాడి కుట్ర.. ఐదుగురు అరెస్టు

UFC Event: ట్రంప్‌ కార్యక్రమంపై డ్రోన్లతో దాడి కుట్ర.. ఐదుగురు అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి కుట్ర పన్నిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రను ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ముందుగానే గుర్తించి భగ్నం చేసింది. ఈ కేసులో 19 ఏళ్ల యువకుడితో పాటు మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

వివరాలు 

ఈవెంట్‌కు నాలుగు రోజుల ముందే ఎఫ్‌బీఐకు సమాచారం

ఈ కుట్ర గురించి యూఎఫ్‌సీ ఈవెంట్‌కు నాలుగు రోజుల ముందే సమాచారం అందినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ వెల్లడించారు. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ప్రయోగించడం, జనసమూహంపై కాల్పులు జరపడం వంటి దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి శక్తివంతమైన తుపాకులను స్వాధీనం చేసుకున్న అధికారులు దాదాపు 20 మంది మధ్య జరిగిన ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పరిశీలించారు. వాటిలో వైట్‌హౌస్‌కు సంబంధించిన ఫొటోలు, మ్యాప్‌లు, దాడి అనంతరం తప్పించుకునే మార్గాలు, ఇతర ప్రణాళికలపై చర్చించినట్లు గుర్తించారు.

వివరాలు 

నిందితుడి తల్లి అనుమానంతో..

ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒహాయోకు చెందిన 19 ఏళ్ల టైసెన్‌ ప్రాపర్‌ ఒకడు. ఇటీవల అతడి ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి, అతడు పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం, గూఢచర్యం, హిట్‌ అండ్‌ రన్‌ మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆన్‌లైన్‌లో చర్చించడం చూసి అనుమానించింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ప్రాపర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, యూఎఫ్‌సీ ఈవెంట్‌పై దాడి చేయాలనే కుట్ర గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తులో నిందితుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేక భావజాలం కలిగినవారని, జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్ల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నవారని, యూదు వ్యతిరేక భావాలు కలిగి ఉన్నవారని అధికారులు గుర్తించారు.

Advertisement

వివరాలు 

ఉగ్ర కుట్ర: జేడీ వాన్స్

ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఈ కుట్ర గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాత్రం దీనిని ఉగ్ర కుట్రగా అభివర్ణించారు. ఇది కొందరు వ్యక్తులు చేసిన ఆకస్మిక చర్య కాదని, పూర్తి సమన్వయంతో పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని ప్రయత్నించిన కుట్ర అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరికొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement