US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్ నిర్ణయం భారత్‌తో పాటు పలు దేశాలకు లాభం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 30.5 ట్రిలియన్ డాలర్లు. ఈ సమయంలో,దేశంలోని కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపుతో ప్రధాన వడ్డీ రేటు 4.1 శాతం నుంచి 3.9 శాతానికి చేరింది. ఇటీవల ప్రభుత్వ షట్‌డౌన్, ఉద్యోగాల వృద్ధి మందగించడం వంటి పరిస్థితుల మధ్య ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య అవసరమని ఫెడ్ వెల్లడించింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ, రేట్ల తగ్గింపు ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
వివరాలు
వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించారు?
ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఉపాధి, ద్రవ్యోల్బణం వంటి అధికారిక గణాంకాలు అందుబాటులో లేవని ఆయన చెప్పారు. ఫలితంగా, ప్రస్తుతానికి ఫెడ్ ప్రైవేట్ సంస్థల అందజేసిన ఆర్థిక సూచనలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. గత రెండు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ వడ్డీ రేట్లను 5.3శాతం వరకు పెంచింది. కానీ దీని ప్రభావంగా ఉద్యోగాల వృద్ధి నెమ్మదించింది,కొత్త ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. వినియోగదారుల ఖర్చు కూడా తగ్గింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ రేటు 3 శాతం చుట్టుపక్కల ఉంది. ఇది ఫెడ్ లక్ష్యమైన 2శాతం కంటే ఎక్కువ.ఈ నేపథ్యంలో పావెల్ మాట్లాడుతూ,"ఇకనుంచి ఆర్థిక వృద్ధి,ఉపాధి పెంపుపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. ఎక్కువ వడ్డీ రేట్లు కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది,"అని వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికా ప్రజలపై ఎలా ఉంటుంది? ప్రపంచంపై ప్రభావం ఉంటుందా?
ఫెడ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సాధారణ అమెరికన్ పౌరులకు కొంత ఉపశమనం లభించనుంది. రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఇళ్లు, కార్లు కొనడం సులభం అవుతుంది. వ్యాపార రుణాలు కూడా చౌకగా లభిస్తాయి. అయితే, పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో మాత్రం ఈ చర్యకి విస్తృత ప్రభావం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గడంతో డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంది. దీని ఫలితంగా భారత్‌తో పాటు ఆసియా దేశాల్లో పెట్టుబడులు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
ప్రభుత్వ షట్‌డౌన్ ఒక పెద్ద సవాలుగా మారింది
అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ షట్‌డౌన్ ప్రభుత్వ, కాంగ్రెస్ మధ్య బడ్జెట్ వివాదం కారణంగా ఏర్పడింది. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఉన్నారు. అనేక విభాగాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. అధికారిక ఆర్థిక గణాంకాలు లభించకపోవడం వల్ల ఫెడ్ నిర్ణయాలు తీసుకోవడం కష్టమైందని పావెల్ తెలిపారు. ఆయన మాటల్లో, "ప్రస్తుత పరిస్థితులను బట్టి డిసెంబర్‌లో జరగనున్న తదుపరి సమావేశంలో వడ్డీ రేట్లపై కొత్త నిర్ణయం తీసుకుంటాం," అని స్పష్టం చేశారు.