LOADING...
Bangladesh: "రాజీనామా ఆలోచనలోనే ఉన్నా": యూనస్‌ ప్రభుత్వంపై బంగ్లా అధ్యక్షుడు షాబుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు
యూనస్‌ ప్రభుత్వంపై బంగ్లా అధ్యక్షుడు షాబుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

Bangladesh: "రాజీనామా ఆలోచనలోనే ఉన్నా": యూనస్‌ ప్రభుత్వంపై బంగ్లా అధ్యక్షుడు షాబుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. యూనస్‌ ప్రభుత్వం తనతో అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తన పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నానని స్పష్టంచేశారు. బంగ్లాలో రాబోయే ఏడాది ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరుగనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ నసీరుద్దీన్‌ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాబుద్దీన్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

వివరాలు 

ఎన్నికలు జరిగేంతవరకూ నేను నా పదవిలో కొనసాగుతా:  షాబుద్దీన్‌ 

ఢాకాలోని అధ్యక్ష భవనంలో నుంచి ఆయన ఒక వార్తాసంస్థకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇదే తన తొలి ఇంటరాక్షన్‌ అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలోనే తాను పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. "ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనిపిస్తోంది. వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నా. అయితే ఎన్నికలు జరిగేంతవరకూ నేను నా పదవిలో కొనసాగుతా'' అని అన్నారు. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన షాబుద్దీన్‌ 2023లో అవామీ లీగ్‌ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో గతేడాది ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వివరాలు 

ఏడు నెలలుగా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు 

ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వారి అభీష్టానుసారం అధ్యక్షుడిని ఎన్నుకోదలిచితే తాను పక్కకు తప్పుకుంటానని షాబుద్దీన్‌ పేర్కొన్నారు. యూనస్‌ తన అధికారాలను గణనీయంగా తగ్గించేసారని, దాదాపు ఏడు నెలలుగా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని ధ్వజమెత్తారు. సెప్టెంబర్‌లో అనేక దేశాల్లోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయాల నుంచి తన ఫోటోలను ఒక్కసారిగా తొలగించారని తెలిపారు. దీనివల్ల దేశాధ్యక్షుడిని తొలగించబోతున్నారన్న తప్పు సంకేతం ప్రజల్లో పాకుతుందనే భావన తనలో కలిగిందని, ఇది పూర్తిగా అవమానకరమని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు 

యూనస్‌కు స్వయంగా లేఖ 

ఈ పరిణామాలన్నింటిపై యూనస్‌కు స్వయంగా లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. షాబుద్దీన్‌ వ్యాఖ్యలపై యూనస్‌ తరఫున ఇప్పటికీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతేడాది హింసాత్మక పరిస్థితులు నెలకొన్న సమయంలో తాను సైనిక ఉన్నతాధికారులతో నిరంతరం మాట్లాడినట్టు పేర్కొన్నారు. అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశం లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ తనతో స్పష్టం చేశారని చెప్పారు. విద్యార్థుల నుంచి తొలుత తన రాజీనామాకై డిమాండ్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా తనను పదవి నుంచి తప్పించాలని కోరడం లేదని తెలిపారు. ప్రస్తుతం దిల్లీలో ఉండే హసీనాతో సంప్రదింపులు జరిపారా అన్న ప్రశ్నకు షాబుద్దీన్‌ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

Advertisement