Loading...
Iran: ఇరాన్‌లో వంతెనలపై అమెరికా భీకర దాడులు.. రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ!
ఇరాన్‌లో వంతెనలపై అమెరికా భీకర దాడులు.. రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ!

Iran: ఇరాన్‌లో వంతెనలపై అమెరికా భీకర దాడులు.. రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరపగా, కీలకమైన చాబహార్ ఓడరేవులోని ఒక టవర్‌ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు ఇరానీయులు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా చర్యలతో ఆగ్రహించిన ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియాలో అమెరికాకు మిత్రదేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 86 డాలర్లకు పైగా చేరింది. గత నెల రోజులలో ఇదే అత్యధిక ధరగా నమోదైంది.

వివరాలు

ట్రంప్ హెచ్చరికల తర్వాత అమెరికా దాడులు

ఇరాన్‌తో మళ్లీ చర్చలకు రాకపోతే వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వచ్చారు.

ఆ హెచ్చరికలను అమలు చేస్తూ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అమెరికా బలగాలు ఇరాన్‌పై ఉద్ధృత దాడులు చేపట్టాయి.

దక్షిణ ఇరాన్‌లోని హర్మోజ్‌గన్ ప్రావిన్స్‌లో పలు రహదారి, రైల్వే వంతెనలను కూల్చివేశాయి. బందర్ ఖమీర్ ప్రాంతంపైనా క్షిపణుల దాడులు జరిగాయి.

అలాగే ఇరాన్‌లోని ప్రధాన ఓడరేవు బందర్ అబ్బాస్‌కు వెళ్లే రాకపోకలను అడ్డుకునే వ్యూహంలో భాగంగా వంతెనలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఏడుగురు మరణించారు.

వివరాలు

విద్యుత్ వినియోగంపై ఇరాన్ హెచ్చరిక

విద్యుత్ కేంద్రాలపై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇంధన శాఖ స్పందించింది. దక్షిణ ప్రాంతాల ప్రజలు విద్యుత్‌ను అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వినియోగాన్ని తగ్గించాలని సూచించింది.

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై దాడులు ప్రారంభించింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది.

ఖతార్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.

అయితే శిథిలాలు పడటంతో ఓ చిన్నారి గాయపడినట్లు తెలిపారు. ఇక కువైట్‌లోని కీలక విద్యుత్-నిర్లవణీకరణ (డీసాలినేషన్) ప్లాంటుపై ఇరాన్ దాడి చేసింది.

కువైట్‌లో తాగునీటిలో దాదాపు 90 శాతం ఈ ప్లాంట్ల ద్వారానే సరఫరా అవుతుండటం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు

ఇరాక్, హర్మూజ్ జలసంధిలోనూ ఉద్రిక్తత

జోర్డాన్‌పై ప్రయోగించిన మూడు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఆ దేశం ప్రకటించింది. బహ్రెయిన్‌పైనా దాడులు జరిగినట్లు సమాచారం.

ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలోని ఇర్బిల్, సులయ్మనియా నగరాలపై శుక్రవారం జరిగిన దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడుల వెనుక కూడా ఇరాన్ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే ఒమన్‌కు సమీపంలోని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘటన వెనుక కూడా టెహ్రాన్ పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

'అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశాం' - ఇరాన్

తాజా ఘర్షణల నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

జోర్డాన్‌లో ఉన్న అమెరికా బలగాలకు భారీ నష్టం కలిగించామని, సిరియాలోని అల్-తన్ఫ్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశామని కూడా పేర్కొంది.

గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

ఇదిలా ఉండగా, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

శుక్రవారం ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ బలగాలు దాడి చేయడంతో ఏడుగురు మరణించగా, మరో 22 మంది గాయపడినట్లు సమాచారం.

ADVERTISEMENT