Fire accident: బాంగ్లాదేశ్ ఢాకాలోని ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆరు అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు. అగ్నిప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. కాలిన గాయాలు,శ్వాసకోశ సమస్యల కారణంగా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంతా లాల్ సేన్ శుక్రవారం తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గురువారం రాత్రి 9:50 గంటల సమయంలో మంటలు చెలరేగాయి, వెంటనే క్రమంగా పై అంతస్తులకు విస్తరించింది. 13 ఫైర్ సర్వీస్ యూనిట్లను సమీకరించినట్లు అధికారులు తెలిపారు.
మంటల నుంచి తప్పించుకునేందుకు పై అంతస్తులకు ప్రజలు
ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో 33 మంది ,షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో 10 మంది మరణించారు అని సేన్ చెప్పారు. రెండు ఆరోగ్య కేంద్రాల్లో 22మంది చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పటివరకు ప్రాణాలతో బయటపడిన వారి శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది"అని సేన్ అన్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పై అంతస్తులకు చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలను ఉపయోగించి చాలా మందిని రక్షించారని వారు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.