Indian seafarers: కరాచీకి వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. 23 మంది భారతీయ నావికులు సేఫ్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ నౌకలో 23 మంది భారతీయ నావికులు ఉన్నారు. నోవోరోస్సిస్క్ నుంచి కరాచీ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ నౌకలో సిబ్బంది ఉండే వసతి ప్రాంతాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన నౌక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FUSUI) 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. నౌక సమీపంలో మరో డ్రోన్ కూడా కనిపించినట్లు తెలిపింది.
వివరాలు
23 మంది భారతీయ నావికులు సురక్షితం
డ్రోన్ దాడి జరిగిన సమయంలో ఎంవీ బారియాన్ (MV BARYON) నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు ఉన్నట్లు FUSUI పేర్కొంది.
వారందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.
మంటలను విజయవంతంగా ఆర్పివేసిన అనంతరం నౌక తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది.
భారతీయులను లక్ష్యంగా చేసుకోవద్దు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల్లో భారతీయులకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని FUSUI ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలాంటి ఘటనలపై భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరింది.
సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.
వివరాలు
వాణిజ్య నౌకలకు పెరుగుతున్న ముప్పు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గల్ఫ్ జలాలు, నల్ల సముద్ర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలకు భద్రతా సమస్యలు పెరిగాయి.
కొంతకాలంగా ఈ మార్గాల్లో ప్రయాణించే నౌకలు దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి.
ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా గతంలో వెలుగుచూశాయి.