Japan: జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్ పైనే పేలిపోయిన రాకెట్..!
జపాన్ స్పేస్ ఏజెన్సీ (JAXA) చేపట్టిన రాకెట్ ఇంజిన్ పరీక్ష ఘోరంగా విఫలమైంది. ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఇంజిన్ పేలిపోయి పూర్తిగా దహనమైంది. ఈ ఘటన మంగళవారం ఉదయం నైరుతి జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఘోరమైన పేలుడు, దానికి తోడు మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందరిలో కలకలం రేపాయి.
పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఎప్సిలాన్ ఎస్ జపాన్ చేపట్టిన చిన్న రాకెట్ ప్రయోగాల్లో కీలకమైనది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) దీనిని రూపొందించింది. 2024 మార్చి నాటికి ఈ రాకెట్‌ను ప్రయోగాలకు సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం నేపథ్యంలో దీనిపై పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 16 నెలల క్రితమూ జరిగిన ఇంజిన్ పరీక్ష విఫలమవడం గమనార్హం. ప్రస్తుతం జాక్స వినియోగిస్తున్న ప్రధాన రాకెట్ హెచ్-3ను మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ రూపొందించింది. దాన్ని మొదటిసారి ప్రయోగించినప్పుడు విఫలమైనా, ఆ తర్వాత మూడు సార్లు విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది.
'పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ'తో స్లిమ్‌ను అభివృద్ధి
గత ఏడాది, జాక్స 'స్లిమ్' అనే ల్యాండర్‌ను జాబిల్లిపైకి పంపి తన సాంకేతిక నైపుణ్యాన్ని నిరూపించుకుంది. భవిష్యత్‌లో గ్రహాలపై పంపించే ప్రయోగాలకు దోహదం చేసే 'పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ'తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ ల్యాండర్లు 10 కిలోమీటర్ల దూరంలో దిగుతుంటే, ఈ సాంకేతికతతో కేవలం 100 మీటర్ల దూరంలోనే ల్యాండ్ అవుతుందనే విశేషం ఉంది.