Philippines: అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన వారెంట్ మేరకు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టోను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన ఆ దేశ రాజధాని మనీలాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
హాంకాంగ్ నుంచి స్వదేశానికి చేరుకున్న వెంటనే డ్యూటెర్టోను అరెస్ట్ చేశారు.
ఆయన అమలు చేసిన మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధంలో వేల మంది మరణించారని, దీనిలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై ఐసీసీ విచారణ చేపట్టింది.
వివరాలు
అరెస్టు అంశంపై స్పందించిన ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం
ఈ కేసు విషయంలో గతంలోనే డ్యూటెర్టో స్పందించారు. ఐసీసీ తనపై వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని, అరెస్టుకు సిద్ధంగా ఉండాలని ప్రకటించారు.
అదే సమయంలో, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణచివేయడాన్ని సమర్థించుకున్నారు.
డ్రగ్స్‌కు సంబంధించి నేరస్తులను చంపేయాలని తాను ఆదేశించలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఈ అరెస్టు అంశంపై ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఇప్పటికే పోలీసు అధికారులు వారెంట్ కాపీని డ్యూటెర్టోకు అందజేశారని, ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారని వెల్లడించింది.
డ్యూటెర్టో తరఫున న్యాయవాది సాల్వడోర్ పనెలో మాట్లాడుతూ, ఈ అరెస్టు అన్యాయమని పేర్కొన్నారు. అలాగే, డ్యూటెర్టో వద్దకు న్యాయవాదిని వెళ్లనివ్వలేదని ఆరోపించారు.
వివరాలు
ఫిలిప్పీన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు
డ్యూటెర్టో అధికారంలో ఉన్న 2019లో, ఫిలిప్పీన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్యలపై ఐసీసీ దర్యాప్తును ప్రారంభించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఐసీసీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది. గతేడాది వరకు ఈ దర్యాప్తుకు సహకరించేందుకు ఆ దేశం నిరాకరించింది.
తాను దావౌ నగర మేయర్‌గా ఉన్న సమయంలో, నగరంలో నేరాలను నియంత్రించేందుకు ఒక డెత్‌స్క్వాడ్ తన ఆధీనంలో పనిచేసిందని రోడ్రిగో డ్యూటెర్టో గతంలో అంగీకరించారు.
2016లో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, దావౌలో అమలు చేసిన విధానాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తానని వాగ్దానం చేశారు.
వివరాలు
డ్యూటెర్టో అమలు చేసిన 'మాదక ద్రవ్యాలపై యుద్ధం'
అనుమానితులను రెచ్చగొట్టి, తిరగబడేలా చేసి, పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడానికి తగిన సాకులు లభించేలా ప్రవర్తించమని తానే అధికారులకు సూచించానని ఆయన వెల్లడించారు.
తన నిర్ణయాల పట్ల ఎలాంటి క్షమాపణలు చెప్పనని తేల్చి చెప్పారు.
డ్యూటెర్టో అమలు చేసిన 'మాదక ద్రవ్యాలపై యుద్ధం' కారణంగా దేశవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో వేల మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని, ప్రస్తుతం ఆ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారిస్తోందని సమాచారం.