Loading...
Yoon Suk Yeol : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు జీవిత ఖైదు

Yoon Suk Yeol : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు జీవిత ఖైదు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై దేశంలో తిరుగుబాటు చర్యలకు నాయకత్వం వహించినట్లు కోర్టు నిర్ధారించి గురువారం జీవిత ఖైదు శిక్ష విధించింది. తాను విధించిన అత్యవసర మార్షల్ లా దేశాన్ని తీవ్ర రాజకీయ కలకలానికి గురిచేసి, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో దక్షిణ కొరియాలో ఇటీవల నెలకొన్న అతిపెద్ద రాజకీయ సంక్షోభానికి ఒక అధ్యాయం ముగిసినట్టైంది. 2024 డిసెంబర్ 3 అర్ధరాత్రి టెలివిజన్ ప్రసంగంలో యూన్, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉన్న "దేశ వ్యతిరేక శక్తులు" ఉన్నాయని ఆరోపిస్తూ మార్షల్ లా ప్రకటించారు. వెంటనే సైనికులు హెలికాప్టర్లలో పార్లమెంట్ భవనానికి చేరుకుని సభా మందిరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

వివరాలు 

ఆరు గంటల్లోనే నిర్ణయాన్నివెనక్కి తీసుకున్న యూన్

దీంతో ఆగ్రహించిన పౌరులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది కలిసి ప్రవేశ ద్వారాలను అడ్డుకుని సైనికులను లోపలికి వెళ్లకుండా నిలువరించారు.

ఆ గందరగోళ దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. యూన్ నిర్ణయం దేశంలోని గత సైనిక పాలన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది.

ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిందని, ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా మారిందని విస్తృతంగా విమర్శలు వచ్చాయి.

అయితే, కేవలం ఆరు గంటల్లోనే యూన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యులు బలవంతంగా సభలోకి ప్రవేశించి ఏకగ్రీవంగా మార్షల్ లాను రద్దు చేశారు.

వివరాలు 

ఆసియాలో అమెరికాకు ముఖ్య మిత్రదేశం

1980ల చివర నుంచి దక్షిణ కొరియా బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది.

స్వేచ్ఛాయుత ఎన్నికలు, నిరసనలు, మాట స్వేచ్ఛ, శాంతియుత అధికార మార్పిడి వంటి విలువలు బలపడ్డాయి.

అంతర్జాతీయ ఆర్థిక రంగంలోనూ కీలక దేశంగా ఎదిగి, ఆసియాలో అమెరికాకు ముఖ్య మిత్రదేశంగా నిలిచింది.

అయినప్పటికీ దేశీయ రాజకీయాలు తీవ్ర విభేదాలతో కొనసాగుతున్నాయి. పలువురు అధ్యక్షులు పదవీకాలంలోనే అభిశంసన, దర్యాప్తులు, కేసులు ఎదుర్కొన్నారు.

సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు వెలుపల యూన్ అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడి, దేశవ్యాప్తంగా ప్రసారమైన విచారణను పెద్ద తెరపై వీక్షించారు.

ADVERTISEMENT

వివరాలు 

మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యున్‌కు 30ఏళ్ల జైలు శిక్ష

ప్రధాన న్యాయమూర్తి జీ గ్వి యోన్ మాట్లాడుతూ, యూన్ మార్షల్ లా ప్రకటన వెనుక ఉద్దేశ్యం జాతీయ అసెంబ్లీని స్థంభింపజేయడమేనని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేతతో పాటు తన సొంత పార్టీ నాయకుడు హాన్ డాంగ్ హూను అరెస్టు చేయాలని ప్రయత్నించడం కూడా తిరుగుబాటు చర్యలేనని పేర్కొన్నారు.

హెలికాప్టర్లలో సైనికులను పార్లమెంట్‌కు పంపడం స్పష్టమైన తిరుగుబాటు చర్యగా అభివర్ణించారు.

మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యున్‌కు కూడా 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

మార్షల్ లా అమలు చేయమని సైనికులకు ఆదేశించింది తనేనని ఆయన ఇప్పటికే అంగీకరించారు.

ADVERTISEMENT

వివరాలు 

అధ్యక్షుడిగా రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించా: యూన్

డిసెంబర్ 3న యూన్ ప్రకటన విన్న వెంటనే పార్లమెంట్‌కు వెళ్లిన సాంగ్ హ్వా అనే మహిళ, ఈ తీర్పు ప్రజలకు బలమైన సందేశం ఇస్తుందని వ్యాఖ్యానించారు.

రీబిల్డింగ్ కొరియా పార్టీ నాయకుడు చో కుక్, యూన్ దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారని విమర్శించారు.

తీర్పుపై యూన్ అప్పీల్ చేసే అవకాశముంది. అయితే తనపై తిరుగుబాటు ఆరోపణలను ఆయన ఖండిస్తూ, ప్రతిపక్షం మెజారిటీ కారణంగా దేశంలో ఏర్పడిన రాజకీయ స్థంభనను ప్రజలకు తెలియజేయడానికే మార్షల్ లా విధించానని చెప్పారు.

అధ్యక్షుడిగా రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించానని వాదించారు.

తాను ఎవరినీ అరెస్టు చేయాలనే ఉద్దేశం లేదని, భారీస్థాయి ఆయుధాలు వినియోగించలేదని, ప్రాణనష్టం జరగలేదని కూడా పేర్కొన్నారు.

వివరాలు 

జనవరి 2025లో అరెస్టైన యూన్

దక్షిణ కొరియా చట్టాల ప్రకారం తిరుగుబాటు నేరానికి అధ్యక్షుడికి రక్షణ ఉండదు.ఈ కేసులో ప్రాసిక్యూటర్లు మరణదండన కోరినప్పటికీ, దేశంలో దశాబ్దాలుగా అమలు చేయలేదు.

యూన్ చర్యలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేశాయని ప్రత్యేక న్యాయవాది పార్క్ ఒక్ సు వాదించారు.

ప్రజలు అనుభవించిన భయం,ఆందోళన,బాధ వర్ణనాతీతమని తెలిపారు.యూన్ జనవరి 2025లో అరెస్టయ్యారు.

అరెస్ట్ చేయడానికి వెళ్లిన అధికారులను యూన్ సుక్ యోల్ వారాల తరబడి ఇంటి వద్దే అడ్డుకుని, హైడ్రామా సృష్టించిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

పదవిలో ఉండగానే అరెస్టైన తొలి అధ్యక్షుడిగా యూన్ చరిత్రలో నిలిచారు.

వివరాలు 

మాజీ ప్రధాన మంత్రి హాన్ డక్ సూ కు 23 ఏళ్ల జైలు శిక్ష

మార్షల్ లా ప్రకటించిన 11 రోజుల్లోనే ఆయనపై అభిశంసన తీర్మానం ఆమోదమై, నాలుగు నెలల తరువాత పదవి నుంచి తొలగించబడ్డారు.

గత నెలలో అధికారులను అడ్డుకోవడం, అధికార దుర్వినియోగం, పత్రాల కల్పితం కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడింది.

ఇక ఉత్తర కొరియాతో కలిసి ఉద్రిక్తత సృష్టించేందుకు రహస్య డ్రోన్లు వినియోగించారని మరో కేసు ఎదుర్కొంటున్నారు.

యూన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ ప్రధాన మంత్రి హాన్ డక్ సూ కు 23 ఏళ్ల జైలు శిక్ష, మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి లీ సాంగ్ మిన్‌కు ఏడు ఏళ్ల జైలు శిక్షలు విధించారు.

వివరాలు 

మాజీ అధ్యక్షుడు చున్ డూ హ్వాన్'కి  క్షమాభిక్ష

యూన్ భార్య కిమ్ కియోన్ హీ లంచం కేసులో ఒక సంవత్సరం ఎనిమిది నెలల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

30 ఏళ్ల తర్వాత తిరుగుబాటు కేసులో ఒక నాయకుడికి శిక్ష విధించడం ఇదే మొదటిసారి.

1996లో మాజీ అధ్యక్షుడు చున్ డూ హ్వాన్ 1979 సైనిక తిరుగుబాటు, 1980 గ్వాంగ్జు హత్యాకాండ కేసుల్లో దోషిగా తేలి తొలుత మరణదండన పొందారు.

తర్వాత అది జీవిత ఖైదుగా మారి, అనంతరం క్షమాభిక్ష లభించింది.

ADVERTISEMENT