Dick Cheney: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ (84) కన్నుమూశారు. న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన, చివరికి కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఉపాధ్యక్షులలో చెనీ ఒకరుగా గుర్తింపు పొందారు. 46వ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా ప్రారంభించిన 'వార్ ఆన్ టెర్రర్' (ఉగ్రవాదంపై యుద్ధం) కార్యక్రమానికి ప్రధాన రూపకర్తగా నిలిచారు. ఇరాక్‌పై ఆయన చేసిన వరుస ఆరోపణలే 2003లో వాషింగ్టన్ సైనిక చర్యలకు పునాది వేశాయని భావిస్తారు. డిక్ చెనీ 1941లో నెబ్రాస్కాలో జన్మించారు. చట్టసభ సభ్యుడిగా, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, డిఫెన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించారు.
వివరాలు
జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా కీలక పాత్ర
2001 నుండి 2009 వరకు అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఆయన కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాలంగా రిపబ్లికన్ పార్టీకి శక్తివంతమైన నేతగా ఉన్న చెనీ, తన రాజకీయ జీవిత చివరలో ప్రస్తుత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయనను దేశానికి ప్రమాదకరుడిగా, పిరికిపందగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చెనీని పార్టీ నుంచి తొలగించారు. అనంతరం, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా ఓటు వేశానని ఆయన వెల్లడించారు.