Page Loader
Bali:బాలిలో నీట మునిగిన ఫెర్రీ.. నలుగురు మృతి,38 మంది గల్లంతు 
బాలిలో నీట మునిగిన ఫెర్రీ.. నలుగురు మృతి,38 మంది గల్లంతు

Bali:బాలిలో నీట మునిగిన ఫెర్రీ.. నలుగురు మృతి,38 మంది గల్లంతు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని బాలి సమీపంలో ఘోర సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 38 మంది గల్లంతయ్యారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెలుగుచూశాయి. తూర్పు జావాలోని కేటాపాంగ్ పోర్ట్ నుంచి బాలి ప్రాంతంలోని గిలిమనుక్‌కు ఈ ఫెర్రీ రవాణా సేవలు అందించేది. అయితే బయలుదేరిన కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు 22 వాహనాలు, 14 ట్రక్కులు కూడా ఉన్నాయి.

వివరాలు 

అపస్మారక స్థితిలో ఉన్న 23 మంది

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న 23 మందిని కాపాడారు. ఇంకా గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సముద్రంలో భారీ అలలు వచ్చి పడుతుండటంతో రక్షణ కార్యకలాపాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇండోనేసియా 17 వేలకుపైగా దీవులతో కూడిన దేశం. ఇక్కడ ప్రాంతాల మధ్య రవాణా కోసం ఫెర్రీలు, పడవలు ముఖ్యమైన ప్రయాణ మాధ్యమాలుగా ఉపయోగించబడుతున్నాయి.

వివరాలు 

2018లో ఇటువంటి ఘటనే.. 

కానీ భద్రతా నిబంధనలు సరిగా పాటించకపోవడం, సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించడంలాంటి కారణాల వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. 2018లో ఇలాంటి ఘోర ఘటనే జరిగింది. సామర్థ్యానికి మించినగా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ బోల్తాపడింది. ఆ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.