France: జీవన వ్యయాల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. 1,800 మంది నిరసనకారుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిపోతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, నిధుల కోత వంటి అంశాలపై మొదలైన ఆందోళనలు క్రమంగా విధ్వంసానికి దారితీశాయి. నిరసనకారుల ముసుగులో కొందరు అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న దుండగులు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడటంతోపాటు పోలీసులతో ఘర్షణలకు దిగుతున్నారు.
వివరాలు
పోలీసులు అదుపులోకి 1,800 మంది
ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 1,800 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం ముసుగులు ధరించిన వ్యక్తుల గుంపులు పలు నగరాల్లో చారిత్రక భవనాలకు నిప్పుపెట్టాయి.
ప్రభుత్వ కార్యాలయాలు, నగర పాలక సంస్థల భవనాలపైనా దాడులకు పాల్పడ్డాయి.
సెంట్రల్ ఫ్రాన్స్‌లోని లిమోజెస్ నగరంలో 19వ శతాబ్దానికి చెందిన చారిత్రక సిటీ హాల్‌కు మంటలు వ్యాపించడంతో దాని పైకప్పు కూలిపోయింది.
భవనంలో చాలా భాగం అగ్నికి ఆహుతైంది. ఆదివారం నాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
నిరసనల్లో సుమారు 8 లక్షల మంది
దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదివారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. హింసకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.
రాజధాని పారిస్‌తోపాటు మార్సెయిల్, లియోన్, బోర్డో, రెన్నెస్, స్ట్రాస్‌బర్గ్, గ్రెనోబుల్, నైస్, లిమోజెస్ నగరాల్లో వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగినట్లు సమాచారం.
ఖరీదైన దుస్తులు, ఇతర వస్తువులను దుండగులు పట్టపగలే ఎత్తుకెళ్లారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనల్లో సుమారు 8 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు.