భారత్,చైనా,రష్యాలకు శ్రీలంక ఉచిత వీసా ; జాబితాలో US లేదు
భారత్ ,చైనా,రష్యా,మలేషియా,జపాన్,ఇండోనేషియా,థాయ్‌లాండ్ దేశాల ప్రయాణికులకు ఐదు నెలల పాటు ఉచిత వీసాలు మంజూరు చేసే ప్రతిపాదనను శ్రీలంక మంత్రివర్గం ఆమోదించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మంగళవారం ప్రకటించారు. సబ్రీ ప్రకారం, ఉచిత వీసా ప్రయాణం పైలట్ ప్రాజెక్ట్‌గా తక్షణమే అమలులోకి వచ్చింది. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది. శ్రీలంక పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడమే ఈ చర్య ఉద్దేశ్యం. రాబోయే సంవత్సరాల్లో పర్యాటకుల రాకపోకలను ఐదు మిలియన్లకు పెంచాలని తాము భావిస్తున్నట్లు శ్రీలంక మీడియాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలోని చాలా పర్యాటక ప్రదేశాలకు ఈ-టికెటింగ్ విధానం
ఈ చర్య వల్ల ప్రయాణికులకు వీసాలు పొందేందుకు ఖర్చు చేసే డబ్బు,సమయం కూడా ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు మంజూరు చేసేందుకు క్యాబినెట్ సమావేశంలో ప్రతిపాదనను సమర్పించినట్లు గత వారం పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్యాబినెట్ పేపర్‌ను శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్దన, టూరిజం,ల్యాండ్స్ మంత్రి హరీన్ ఫెర్నాండో, పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి తిరాన్ అల్లెస్, విదేశాంగ మంత్రి అలీ సబ్రీ సంయుక్తంగా సమర్పించారు. సమీప భవిష్యత్తులో దేశంలోని చాలా పర్యాటక ప్రదేశాలకు ఈ-టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని క్యాబినెట్ ప్రతిపాదించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపిందని స్థానిక మీడియా నివేదించింది.