Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వానలు.. ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్న నదులు, 21 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌ను భారీ వర్షాలు మరోమారు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి.ఈ ఘటనల్లో ఇప్పటివరకూ 21 మంది మృతి చెందారు. ఎడతెరిపిలేని వర్షాలతో పలు ప్రాంతాల్లో నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు రహదారులపై రాకపోకలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి నేపాల్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజా వరదలు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెల వరదల్లో కనీసం 1,453 మంది మృతి చెందగా.. మరో 5,000 మందికిపైగా ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో వరదలు,కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వివరాలు
1,284 మందిని రక్షించిన భద్రతా సిబ్బంది
పాల్పా జిల్లాలోని మథగాఢి గ్రామీణ మున్సిపాలిటీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడి ఓ ఇల్లు మట్టిలో కూరుకుపోయింది.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలను వెలికితీశారు.
మరోవైపు గత నాలుగు రోజుల్లో వరదలు, కొండచరియలు, పిడుగులు, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. గత ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన 439 ఘటనలు చోటుచేసుకున్నాయి.
వరదలు, కొండచరియలు, నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న 1,284 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు.
వివరాలు
ప్రమాదంలో 200 ఇళ్లు
లుంబినీ ప్రావిన్స్‌లోని రూపందేహి జిల్లాలో టినౌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహించడంతో శనివారం రాత్రి బుట్వాల్‌లో నది ఒడ్డున ఉన్న ఆరు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
సుమారు 200 ఇళ్లు ప్రమాదంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
టినౌ నది, సమీపంలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాత్రికి రాత్రే భద్రతా సిబ్బంది సుమారు 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చిత్వాన్ జిల్లాలో నారాయణి నది, రియు వాగు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదస్థాయిని దాటాయి.
దేవ్‌ఘాట్ వద్ద నారాయణి నది నీటిమట్టం 9.23 మీటర్లకు చేరింది.
అక్కడ ప్రమాదస్థాయి 9 మీటర్లు కాగా.. దానిని మించి నీరు ప్రవహించింది. రియు వాగు నీటిమట్టం 3.92 మీటర్లకు చేరింది. దీని ప్రమాదస్థాయి 3.8 మీటర్లు.
వివరాలు
పొంగిపొర్లుతున్న నారాయణి, సప్తకోశి నదులు
భారీ వర్షాల కారణంగా చిత్వాన్‌లో పలు ప్రాంతాల్లో కొండచరియలు, మట్టి చరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి.
కర్ణాలీ ప్రావిన్స్‌లోని పలు ప్రధాన రహదారులపై కూడా కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శనివారం నారాయణి, సప్తకోశి నదులు పొంగిపొర్లడంతో నావల్‌పరాసి వెస్ట్, సప్తరి జిల్లాల్లో 389 ఇళ్లు నీట మునిగాయి.
దీంతో వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.
వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.