Loading...
Vladimir Putin: ఆర్థికం నుంచి సాంకేతికత వరకు.. భారత్‌ విజయాలపై పుతిన్‌ ప్రశంసలు
ఆర్థికం నుంచి సాంకేతికత వరకు.. భారత్‌ విజయాలపై పుతిన్‌ ప్రశంసలు

Vladimir Putin: ఆర్థికం నుంచి సాంకేతికత వరకు.. భారత్‌ విజయాలపై పుతిన్‌ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ సాధిస్తున్న ప్రగతిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్‌ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుందని అన్నారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-రష్యా సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయని పుతిన్‌ చెప్పారు. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ (SCO), బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.

వివరాలు

భారత్‌ అభివృద్ధికి రష్యా అండ: రాయబారి

అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి కూడా భారత్‌-రష్యా భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు.

భారత్‌ అభివృద్ధి ప్రయాణానికి రష్యా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ దేశ రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌ ముందుకు సాగుతున్న తీరును చూస్తుంటే.. ప్రజల కలలన్నీ నెరవేరుతాయనే విశ్వాసం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ భారత్‌కు రష్యా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వివరాలు

అంతరిక్షం నుంచీ శుభాకాంక్షలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రష్యా వ్యోమగాములు ప్యోటర్‌ దుబ్రోవ్‌, అన్నా కికీనా, ఆండ్రే ఫెద్యాయెవ్‌ కూడా భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా భారత్‌-రష్యా అంతరిక్ష సహకారాన్ని వారు గుర్తుచేశారు.

1975లో ఆర్యభట ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమైన ఇరు దేశాల అంతరిక్ష సహకారం.. 1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్షయాత్రతో మరింత బలోపేతమైందని అన్నా కికీనా పేర్కొన్నారు.

ప్రస్తుతం గగన్‌యాన్‌ మిషన్‌ కోసం భారత వ్యోమగాములకు రష్యాలో శిక్షణ అందించిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. భారత్‌-రష్యా స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఆండ్రే ఫెద్యాయెవ్‌ ఆకాంక్షించారు.

ADVERTISEMENT