LOADING...
Germany: కార్మికుల కొరతతో కష్టాల్లో జర్మనీ.. భారత్ వైపు మళ్లడానికి కారణం ఇదే!
కార్మికుల కొరతతో కష్టాల్లో జర్మనీ.. భారత్ వైపు మళ్లడానికి కారణం ఇదే!

Germany: కార్మికుల కొరతతో కష్టాల్లో జర్మనీ.. భారత్ వైపు మళ్లడానికి కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీ ప్రస్తుతం తీవ్ర నైపుణ్య కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు భారత్‌పై దృష్టి సారించిన జర్మనీ ప్రభుత్వం, భారతీయ విద్యార్థులు, యువ నిపుణులను ఆకర్షించేందుకు వీసా, భాషా నిబంధనలను సడలిస్తోంది.

వివరాలు

జనాభా సంక్షోభం పెరుగుతోంది

జర్మనీలో జనాభా వృద్ధి గణనీయంగా మందగిస్తోంది. 2025 నాటికి దేశ జనాభా 83.6 మిలియన్లుగా ఉండగా, 2024లో కేవలం 0.1% మాత్రమే పెరిగింది (2023లో 0.4%). ముఖ్యంగా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024లో 60-79 ఏళ్ల వయసు గల వారి సంఖ్య 2.2% పెరిగింది. 80 ఏళ్లు దాటిన వారు కూడా పెరుగుతుండగా, మొత్తం జనాభాలో 30.5% మంది 60 ఏళ్లు పైబడిన వారే. ఇక జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఫెర్టిలిటీ రేటు 1.35-1.39 మధ్య ఉండగా, జనాభా స్థిరంగా ఉండాలంటే కనీసం 2.1 అవసరం. దీంతో ప్రతి ఏడాది జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల ప్రధానంగా వలసలపై ఆధారపడుతోంది.

వివరాలు

విదేశీ కార్మికుల అవసరం పెరుగుతోంది

2024 నాటికి జర్మనీలో విదేశీయుల సంఖ్య 12.4 మిలియన్లకు చేరింది. వీరిలో టర్కీ, ఉక్రెయిన్, సిరియా, రొమేనియా, పోలాండ్ దేశాల ప్రజలు అధికంగా ఉన్నారు. అంచనాల ప్రకారం జర్మనీకి ప్రతి ఏడాది కనీసం 2.88 లక్షల విదేశీ కార్మికులు అవసరం. లేకపోతే 2040 నాటికి పన్నులు చెల్లించే వర్క్‌ఫోర్స్‌ 10% తగ్గే ప్రమాదం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

వివరాలు

భారత్‌పై దృష్టి

ఈ నేపథ్యంలో భారత్ కీలకంగా మారింది. దేశంలో 1.46 బిలియన్ జనాభాలో దాదాపు రెండు మూడవ వంతు (15-64 ఏళ్ల మధ్య) పని చేయగల వయస్సులోనే ఉన్నారు. ఇది జర్మనీకి పెద్ద అవకాశంగా కనిపిస్తోంది. ఇందుకోసం 2022లో రెండు దేశాలు మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తరువాత 2024లో జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలాఫ్ షోల్జ్ భారతీయుల కోసం స్కిల్డ్‌ వర్క్‌ వీసా కోటాను ఏడాదికి 20,000 నుంచి 90,000కి పెంచనున్నట్లు ప్రకటించారు.

Advertisement

వివరాలు

ఏ రంగాల్లో ఎక్కువ డిమాండ్?

జర్మనీలో నర్సింగ్‌, వృద్ధుల సంరక్షణ, వైద్య రంగం, ట్రేడ్స్‌ (కూలీలు, కార్పెంటర్లు, బేకర్లు), లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటీ, చైల్డ్‌కేర్‌ వంటి రంగాల్లో భారీ కొరత ఉంది. సుమారు 1.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. భారతీయులకు లాభాలు జర్మనీలో పనిచేస్తున్న భారతీయులకు మంచి వేతనాలు లభిస్తున్నాయి. 2024 అధ్యయనం ప్రకారం భారతీయుల సగటు నెల జీతం €5,393 (సుమారు ₹5.8 లక్షలు)గా ఉంది. ఇది జర్మన్‌ ఉద్యోగుల సగటు €4,177 కంటే ఎక్కువ. టెక్నాలజీ, అకడమిక్‌ రంగాల్లో ఎక్కువగా పని చేయడం ఇందుకు ప్రధాన కారణం.

వివరాలు

ఉద్యోగాల కోసం వెళ్లిన యువత

భారత్‌కు చెందిన యువత కూడా ఈ అవకాశాలను వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజయ్‌ కుమార్‌ చందాపాక మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జర్మనీలో ట్రైనీగా పనిచేస్తున్నారు. భారత్‌లో ఉద్యోగం దొరకడం కష్టమైంది. అందుకే Ausbildung (అప్రెంటిస్‌షిప్‌) ఎంచుకున్నానని చెప్పారు. అలాగే ఇషు గరియా అనే యువకుడు కంప్యూటర్‌ ఉద్యోగం బదులుగా జర్మనీలో బేకర్‌గా శిక్షణ తీసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు.

వివరాలు

జర్మనీకి భారతీయులే ఆధారం

జర్మనీలో వ్యాపారులు కూడా భారతీయ కార్మికులపై ఆధారపడుతున్నారు. బుచర్‌ జోయాఖిమ్‌ లెడరర్‌ మాట్లాడుతూ "గతంలో మా ప్రాంతంలో అనేక షాపులు ఉండేవి. ఇప్పుడు నా షాప్‌ ఒక్కటే ఉంది. భారతీయుల లేకుండా ఈ వ్యాపారం కొనసాగేది కాదన్నారు. అదేవిధంగా, మేయర్‌ డయానా స్టోకర్‌ కూడా కిండర్‌గార్టెన్‌ టీచర్ల కొరతను భర్తీ చేసేందుకు భారతదేశంపై ఆధారపడాల్సిందేనని స్పష్టం చేశారు. విదేశీ కార్మికులే భవిష్యత్‌ జర్మనీకి యువ కార్మికుల కొరత తీవ్రంగా ఉందని, దీనికి ఒకే పరిష్కారం విదేశీ ప్రతిభను ఆహ్వానించడమేనని అక్కడి నాయకులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ యువతకు జర్మనీ పెద్ద అవకాశాల ద్వారాన్ని తెరిచింది.

Advertisement