West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, ఆర్థిక అనిశ్చితి నెలకొనడం నేపథ్యంలో దేశాలు పొదుపు చర్యల వైపు అడుగులు వేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు పొదుపు చర్యలు అవసరమని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అనేక దేశాలు కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా దేశాలు గత నెలరోజులుగా వివిధ రకాల పొదుపు చర్యలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంటి నుంచే పని చేసే విధానాన్ని పెంచడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
వివరాలు
ఏ దేశాలు ఏమేం చేస్తున్నాయంటే...
శ్రీలంక, పెరూ, బంగ్లాదేశ్ దేశాలు పాఠశాలల పనిదినాలను తగ్గించాయి. విద్యార్థులకు దూరవిద్యను మరింతగా అందుబాటులోకి తెచ్చాయి. శ్రీలంకలో ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. జోర్దాన్, పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు చేయకుండా ఆంక్షలు విధించాయి. విదేశీ ప్రతినిధులకు ఆతిథ్య కార్యక్రమాలను తగ్గించడంతో పాటు ప్రభుత్వ భవనాల్లో శీతలీకరణ యంత్రాల వినియోగాన్ని జోర్దాన్ పరిమితం చేసింది. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రార్థనా మందిరాల్లో శీతలీకరణ యంత్రాలను కనీసం 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దనే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. కంబోడియా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్ దేశాల్లో కూడా ఇలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి.
వివరాలు
ఏ దేశాలు ఏమేం చేస్తున్నాయంటే...
ఆస్ట్రేలియాలో 'ప్రతి చిన్న పొదుపూ సహాయమే' అనే భావనతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ఇంధన వినియోగాన్ని తగ్గించేలా అవగాహన కల్పిస్తున్నారు. బ్రిటన్‌లో చిన్న వ్యాపారులు విద్యుత్ ఆధారిత తాపన పరికరాలకు మారేందుకు ఆర్థిక సాయం అందించే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ కొరియాలో వాహనాల వినియోగంపై సరి-బేసి సంఖ్యల విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఒకరోజు కొన్ని వాహనాలకే అనుమతి ఇస్తున్నారు.
వివరాలు
ఏ దేశాలు ఏమేం చేస్తున్నాయంటే...
శ్రీలంకలో ప్రకటన ఫలకాలపై వెలిగే దీపాలను నిలిపివేస్తున్నారు. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తున్నాయి. పాకిస్థాన్‌లో నాలుగు రోజుల కార్యాలయ విధానంతో పాటు సగం మంది ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇండొనేసియాలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. మయన్మార్‌లో బుధవారాల్లో ఇంటి నుంచే పని చేయడం తప్పనిసరిగా మార్చారు. వియత్నాం కూడా వ్యాపార సంస్థలు దూరవిధానం, అంతర్జాల సమావేశాలను ఎక్కువగా వినియోగించేలా ప్రోత్సహిస్తోంది.