LOADING...
Green Card: గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ పేరుతో అరెస్టులు.. అమెరికాలో వలసదారుల్లో ఆందోళన
గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ పేరుతో అరెస్టులు.. అమెరికాలో వలసదారుల్లో ఆందోళన

Green Card: గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ పేరుతో అరెస్టులు.. అమెరికాలో వలసదారుల్లో ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం ఇస్తే గ్రీన్‌ కార్డుకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. అయితే, ఇటీవల గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూల పేరుతో కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారన్న వార్తలు అక్కడి వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా మీడియా రిపోర్టుల ప్రకారం అక్కడి అధికారుల చర్యలు ఆశ్చర్యానికి గురిచేసేలా కనిపిస్తున్నాయి. శాన్‌డియాగోలో ఉన్న అమెరికా పౌరసత్వ-వలస సేవల (USCIS) కార్యాలయాల్లో గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూలకు వచ్చిన వ్యక్తులతో పాటు, వారిని వివాహం చేసుకున్న అమెరికన్‌ జీవిత భాగస్వాములను కూడా అధికారులు నిర్బంధించడమే ఈ వివాదానికి కారణమైంది. వీసా గడువు ముగిసిపోయినా అమెరికాలోనే ఉన్నవారినే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఇమిగ్రేషన్‌ న్యాయవాది సమన్‌ నస్సేరి వెల్లడించారు.

వివరాలు 

గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ అని పిలిచి, ఐసీఈ నిర్బంధిస్తోంది

"ఐసీఈ, యూఎస్‌సీఐఎస్‌ కలిసి ఒక విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంటర్వ్యూకి పిలిపించిన వీసా గడువు ముగిసిన వారిని నేరుగా అరెస్టు చేస్తున్నాయి. గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ అని పిలిచి, ఐసీఈ నిర్బంధిస్తోంది" అని తెలిపారు. గత వారం తాను విచారణకు వెంట తీసుకెళ్లిన ఐదుగురు క్లయింట్‌లను ఇలాగే అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వారిపై ఎలాంటి నేర కేసులు లేనప్పటికీ, గతంలో ఎటువంటి అరెస్టులు జరగకపోయినా, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటున్నారనే కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీరందరూ అమెరికన్‌ పౌరులను పెళ్లి చేసుకున్నవారేనని కూడా స్పష్టం చేశారు.

వివరాలు 

వలస చట్టాల ప్రకారం అరెస్టులు, నిర్బంధాలు జరగడం సహజం 

ఇక మరో ఇమిగ్రేషన్‌ న్యాయవాది హబీబ్‌ హస్బిని కూడా ఇటీవలి రోజుల్లో ఇలాంటి అనేక కేసులు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా శాన్‌డియాగో USCIS కార్యాలయం నుండి ఈ తరహా నిర్బంధ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి జాగ్రత్తలు పాటించాలంటూ ప్రత్యేక సూచనలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో,ఐసీఈ మాత్రం ఈ అరెస్టులను సమర్థించింది. ఐసీఈ ప్రతినిధి ఒక మీడియా సంస్థకు మాట్లాడుతూ,జాతీయ భద్రత, ప్రజల భద్రత,సరిహద్దు రక్షణ విషయాల్లో తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించి దేశంలో అక్రమంగా ఉంటే, వలస చట్టాల ప్రకారం అరెస్టులు, నిర్బంధాలు జరగడం సహజమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement