LOADING...
H-1B Visa: భారతీయులకు తీపి కబురు.. అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రాసెసింగ్‌ మళ్లీ ప్రారంభం! 
భారతీయులకు తీపి కబురు.. అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రాసెసింగ్‌ మళ్లీ ప్రారంభం!

H-1B Visa: భారతీయులకు తీపి కబురు.. అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రాసెసింగ్‌ మళ్లీ ప్రారంభం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌ (USA Government Shutdown) ప్రభావంతో నిలిచిపోయిన హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ప్రాసెసింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా కార్మిక శాఖ (DOL) ప్రకటించింది. ఫెడరల్‌ నిధులు విడుదల కాకపోవడంతో సెప్టెంబర్‌ 30 నుంచి అమెరికా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా లేబర్‌ కండీషన్‌ అప్లికేషన్‌ (LCA), ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ (PERM) దరఖాస్తుల ప్రాసెసింగ్‌ పూర్తిగా ఆగిపోయింది. తాజాగా కార్మిక శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం (OFLC) తాత్కాలిక మరియు శాశ్వత ఉపాధి వీసా దరఖాస్తుల ప్రాసెస్‌ను తిరిగి ప్రారంభించింది. దీనితో అమెరికన్‌ కంపెనీలు మళ్లీ వీసా దరఖాస్తులు సమర్పించుకోవచ్చని తెలిపింది.

Details

భారత పౌరులకు ప్రయోజనకరం

గ్రీన్‌ కార్డు సంబంధిత ప్రాసెసింగ్‌లు కూడా తిరిగి ప్రారంభమైనట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం భారతీయ పౌరులకు విశేషంగా ప్రయోజనకరంగా ఉండనుంది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారుల్లో సుమారు 70 శాతం మంది భారతీయులే కావడంతో, ఈ పరిణామం వారికి తీపి కబురుగా నిలిచింది. దరఖాస్తు ప్రాసెసింగ్‌ను పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఓఎఫ్‌ఎల్‌సీ స్పష్టం చేసింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అనేక దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. అమెరికా అంతటా వివిధ సంస్థల నుంచి కొత్త దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని, అందువల్ల సాధారణ ప్రాసెసింగ్‌ సమయం కొంచెం ఎక్కువ కావచ్చని కార్మిక శాఖ వివరించింది.