
US-Canada: "మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదం అధ్యక్షుడు ట్రంప్": కెనడా ప్రధాని మార్క్ కార్నీ
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మిత్రదేశాలుగా భావించబడే అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఇరు దేశాలు (US-Canada) పరస్పరం టారిఫ్‌లు విధించుకోవడంతో విభేదాలు భగ్గుమన్నాయి.
ఈ తరుణంలో, కెనడా మాజీ కేంద్ర బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రి అభ్యర్థి మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఏప్రిల్ 28న జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల డిబేట్‌లో భాగంగా వెలువడ్డాయి.
వివరాలు
మాంట్రియల్‌లో జరిగిన డిబేట్‌లో కార్నీ విమర్శలు
ఎన్నికల తరుణంలో మాంట్రియల్ నగరంలో నిర్వహించిన డిబేట్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్క్ కార్నీ ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
''ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్‌లు (ఆంక్షలు) కారణంగా, గత 40 ఏళ్లుగా అమెరికా-కెనడా మధ్య కొనసాగుతున్న సుస్థిర సంబంధం ఒక్కసారిగా ధ్వంసమైంది. ట్రంప్ వ్యవహార శైలి, మా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టింది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే, కెనడా లోపలే ఉన్న వాణిజ్య అడ్డంకులను తొలగించాలి. అందుకు ప్రావిన్సులు, టెరిటరీల సహకారం అత్యంత అవసరం. ఇలాగే నైతికంగా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కెనడియన్లకు వాస్తవిక ఆర్థిక లాభాలు లభిస్తాయి,'' అని వివరించారు.
వివరాలు
వాణిజ్య చర్చలకు తక్షణం సిద్ధమని హామీ
ఇక తాను ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే, అమెరికా ప్రభుత్వంతో వాణిజ్య చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటానని కార్నీ ప్రకటించారు.
ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిలిచి, రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు.