Loading...
Guinea: గినియాలో ఘోర విషాదం.. చెత్త కుప్ప కూలి 30 మంది మృతి, 22 మందికి గాయాలు
గినియాలో ఘోర విషాదం.. చెత్త కుప్ప కూలి 30 మంది మృతి, 22 మందికి గాయాలు

Guinea: గినియాలో ఘోర విషాదం.. చెత్త కుప్ప కూలి 30 మంది మృతి, 22 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా దార్ ఎస్ సలామ్ ప్రాంతంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన భారీ చెత్త కుప్ప ఒక్కసారిగా కూలిపోయింది. సమీపంలోని ఇళ్లపై చెత్త దిబ్బలు విరిగిపడటంతో 30మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలతో విరిగిపడిన చెత్త దిబ్బలు రాయిటర్స్ కథనం ప్రకారం.. కొనాక్రీలోని దార్ ఎస్ సలామ్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్‌ఫిల్‌లో ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడ పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త దిబ్బలు ఒక్కసారిగా కదిలి సమీపంలోని నివాసాలపై పడిపోయాయి. ఈ ఘటనలో ఓ అపార్ట్‌మెంట్‌తో పాటు పలు ఇళ్లు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయాయి.

వివరాలు 

ఎక్స్‌కవేటర్లతో సహాయక చర్యలు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న గినియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎన్‌జీయూసీహెచ్) సిబ్బంది, స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

ఎక్స్‌కవేటర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీస్తున్నారు.

ఈ ఘటనలో తన ఐదుగురు పిల్లలను కోల్పోయినట్లు స్థానిక బాధితుడు సిరే డియాల్లో కన్నీరుమున్నీరయ్యారు.

ముందే హెచ్చరించిన ప్రభుత్వం

ఈ డంపింగ్ యార్డు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందుగానే గుర్తించింది.

దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే పలువురు నివాసితులు అక్కడి నుంచి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోయారు.

దీంతో ప్రమాదం జరిగిన సమయంలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.

వివరాలు 

బాధితులను పరామర్శించిన ప్రధాని

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గినియా ప్రధానమంత్రి అమదౌ బార్ సందర్శించారు.

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ప్రజలు సంయమనం పాటించాలని, సహాయక చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.

ల్యాండ్‌ఫిల్ శాశ్వతంగా మూసివేత

భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదానికి గురైన ల్యాండ్‌ఫిల్‌ను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రాదేశిక పరిపాలన శాఖ మంత్రి ప్రకటించారు.

ఇకపై నగరంలో సేకరించే వ్యర్థాలను నగర శివార్లకు తరలించేలా చర్యలు చేపడతామని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

మౌలిక సదుపాయాల కొరత

ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలతో పాటు భారీగా ఇనుప ఖనిజ సంపద ఉన్న దేశాల్లో గినియా ఒకటి. అయినప్పటికీ ఆ దేశంలో మౌలిక సదుపాయాల కొరత, పేదరికం తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఘటనతో వ్యర్థాల నిర్వహణ, ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ADVERTISEMENT