జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి
మెక్సికో జుయారెజ్ నగరంలోని జైలుపై గుర్తులు తెలియని సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14మంది మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో 10మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో దాదాపు 24మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. ఉదయం 7 గంటలకు వాహనాల్లో వచ్చిన సాయుధులు.. ఒక్కసారిగా కాల్పులకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఆ జైలు ప్రస్తుతం మెక్సికన్ సైనికులతోపాటు, రాష్ట్ర పోలీసులు నియంత్రణలోకి వచ్చనట్లు అధికారులు చెప్పారు.
డ్రగ్స్ మాఫీయా పనేనా?
మెక్సికన్ జైళ్లపై గతంలో కూడా దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. జైలులో ఖైదీల మధ్య కూడా తరుచూ గొడవలు జరుగుతుంటాయి. అలాగే.. జుయారెజ్ వంటి ప్రదేశాల్లో డ్రగ్స్ మాఫీయా చాలా బలంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ దాడి డ్రగ్స్ మాఫీయా పనా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. జైలుపై దాడి జరిగిన కొద్ది క్షణాల ముందే.. సాయుధులు బౌలేవార్డ్ మున్సిపల్ పోలీసులపై కాల్పులు జరిపారు. వీరే జైలు వెలుపల ఉన్న భద్రతా సిబ్బందిపై దాడిచేసినట్లు అధికారులు చెప్పారు. కాగా.. ఆగస్టులో జుయారెజ్ జైలులో అల్లర్లు చెలరేగగా.. 11 మంది మరణించారు.