South Sudan: బంగారు గని వద్ద వివాదం.. దక్షిణ సూడాన్‌లో నరమేధం... 70 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ సూడాన్‌లో మరోసారి రక్తపాతం చోటుచేసుకుని దేశాన్ని కుదిపేసింది. రాజధాని జుబాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు దాడికి దిగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ దారుణ ఘటనలో కనీసం 70మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా,అనధికారిక సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 85 దాటే అవకాశముందని చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, గని ప్రాంతంలో తలెత్తిన వివాదం ఈ రక్తపాతానికి కారణమైనట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా దుండగులు కాల్పులకు తెగబడి అక్కడ ఉన్న పౌరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాలు
స్థానిక యువకుల మధ్య విభేదాలు
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే గని ప్రాంతంలో ఇటువంటి దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018లో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత కూడా దక్షిణ సూడాన్‌లో పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అక్రమ గనుల తవ్వకాలు, స్థానిక యువకుల మధ్య విభేదాలు, అలాగే సాయుధ గుంపుల మధ్య ఆధిపత్య పోరు తరచుగా ఘర్షణలకు దారితీస్తున్నాయి.
వివరాలు
ఘటనపై సమగ్ర విచారణకు మైనింగ్ శాఖ ఆదేశం
ఈ పరిస్థితులు దేశంలో శాంతి స్థాపనకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మైనింగ్ శాఖ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ దాడి దేశంలోని శాంతి ప్రక్రియను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.