గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి
గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికే డార్మిటరీ పూర్తిగా దగ్ధమైనట్లు గయానా ఫైర్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో 14 మంది చిన్నారులు చనిపోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
పరిస్థితి విషమంగా ఉన్న వారిని రాజధానికి తరలింపు
పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరితో సహా మరో ఆరుగురిని విమానంలో గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు తరలించారు. మరికొందరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 20మంది విద్యార్థులను రక్షించారు. మరణించిన 19 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది స్వదేశీయులేనని పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ మార్క్ రామోటర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.