LOADING...
H-1B Visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు.. వీసా రుసుము పెంపును సమర్థించిన వైట్ హౌస్
హెచ్‌-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు..వీసా రుసుము పెంపును సమర్థించిన వైట్ హౌస్

H-1B Visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు.. వీసా రుసుము పెంపును సమర్థించిన వైట్ హౌస్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఇటీవల హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్ల వరకు పెంచే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇప్పటికే పలు సంస్థలు,సమాఖ్యలు కోర్టులను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలీనా లివిట్‌ (Karoline Leavitt) తాజా ప్రకటనలో స్పందించారు.

వివరాలు 

అమెరికన్ల వేతనాలు తగ్గించేస్తున్నాయి: వైట్‌హౌస్

"హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో అనేక మోసాలు జరుగుతున్నాయి.ఈ వ్యాజ్యాలపై కోర్టులో బలంగా పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం, అలాగే వీసా వ్యవస్థను బలపరచడం అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన లక్ష్యం. చాలా కాలంగా హెచ్‌-1బీ వీసా దుర్వినియోగానికి గురై, అమెరికా ఉద్యోగుల వేతనాలు తగ్గించే పరిస్థితి నెలకొంది. అందుకే ఈ వ్యవస్థను సమూలంగా సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవే, అవసరమైతే కోర్టులో దానికి న్యాయబద్ధంగా సమాధానం ఇస్తాం" అని లివిట్‌ తెలిపారు.

వివరాలు 

హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడి ఉన్న వ్యాపార సంస్థలకు తీవ్రమైన ఇబ్బందులు

ఇక ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ఆమోదించిన క్లిష్టమైన వీసా వ్యవస్థపై ట్రంప్‌ చర్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడి ఉన్న వ్యాపార సంస్థలకు ఇది తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుందని తమ పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అధ్యక్షుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ సభ్యులు కూడా ట్రంప్‌కు లేఖ పంపారు. ఈ నిర్ణయం అమెరికా కంపెనీల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, నైపుణ్యం కలిగిన వలస కార్మికులను కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.