
H-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధం ..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలు చేయడానికి సిద్ధమయ్యారు.
అమెరికా కాలమానం ప్రకారం మార్చి 20 నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనున్నారు.
దీని ప్రభావంగా హెచ్-1బీ (H-1B visa) వీసా ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వివరాలు
ఐదేళ్ల కంటే పాత రికార్డులన్నీ సిస్టమ్ నుంచి తొలగింపు
తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాత రికార్డులన్నీ సిస్టమ్ నుంచి తొలగించనున్నారు.
ఉదాహరణగా, ఒక దరఖాస్తు 2020 మార్చి 22న తుది నిర్ణయం పొందితే, ఈ ఏడాది మార్చి 22 నాటికి ఆ రికార్డులను తొలగించనున్నారు.
ఉద్యోగులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసా రికార్డులన్నిటిని మార్చి 19లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సంబంధిత సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. లేదంటే ఆ రికార్డులను శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
కొత్త దరఖాస్తు విధానం
హెచ్-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్లు, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ల తొలగింపుకు ఈ నిర్ణయం ప్రభావం చూపనుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది.
త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనుంది.
దరఖాస్తుదారులకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.
అందుకే, పాత రికార్డులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.