Page Loader
H-1B visa: హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష
హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష

H-1B visa: హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత మూలాలు కలిగిన వ్యక్తి కిశోర్‌కు న్యాయస్థానం 14 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై వీసా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా, కోర్టు మరికొన్ని ఆర్థిక విధానాలను కూడా అమలు చేసింది. వీటిలో $1.25 లక్షల నష్ట పరిహారం,$7,500 డాలర్ల అదనపు జరిమానా,అలాగే ప్రత్యేక రుసుముగా మరో $1,100 వసూలు చేయాలని ఆదేశించింది. కిశోర్‌ సహవ్యవస్థాపకుడిగా పనిచేసిన నానోసెమాంటిక్స్ (Nanosemantics) అనే సంస్థ ద్వారా, అక్రమంగా హెచ్‌-1బీ వీసాలు పొందేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు దర్యాప్తులో నిజమని తేలిన నేపథ్యంలో, గత సంవత్సరం కిశోర్ తన నేరాన్ని అంగీకరించారు. ఈ అంగీకారాన్నిబట్టి తాజాగా ఆయనకు శిక్ష ఖరారు చేశారు.

వివరాలు 

కిశోర్‌తోపాటు మరో ఇద్దరిపై వీసా మోసం, కుట్ర కేసులు

కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతానికి చెందిన కిశోర్‌, అక్కడి టెక్నాలజీ కంపెనీల కోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నానోసెమాంటిక్స్ సంస్థ ద్వారా నియమించి, అందుకు కమీషన్‌ తీసుకునే వ్యవహారంలో పాల్గొంటున్నాడు. అయితే, 2019 సంవత్సరం నాటికే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేనప్పటికీ, ముందుగానే వీసాల కోసం దరఖాస్తు చేసి మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ హెచ్‌-1బీ వీసాల మోసం వ్యవహారాన్ని విచారించిన పోలీసులు, కిశోర్‌తోపాటు మరో ఇద్దరిపై వీసా మోసం, కుట్ర కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం న్యాయ వ్యవస్థ దృష్టికి వెళ్లి, తుది తీర్పుతో శిక్ష ఖరారయ్యింది.