H-1B Visa: హెచ్-1బీ వీసా రూల్స్ మార్పు.. కనీస వేతనం 14వేల డాలర్లు పెంపునకు ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో టెక్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలక చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే యూఎస్ కార్మిక శాఖ హెచ్-1బీ వీసాదారుల వేతనాలను పెంచేలా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం సుమారు 14,000డాలర్ల మేర పెరిగే అవకాశముంది. ప్రస్తుతం అమెరికాలో స్థానికులతో పోలిస్తే H-1B Visaకలిగిన విదేశీ ఉద్యోగులు సగటున 10,191డాలర్లు తక్కువ వేతనం పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంప్యూటర్, ఐటీ రంగాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రవేశపెట్టిన ఈవీసా ప్రోగ్రామ్‌ను కొన్ని కంపెనీలు తక్కువ వేతనంతో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
లెవల్-3 వారికి 70 శాతం
2024 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన హెచ్-1బీ వీసాల్లో 63 శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే చెందినవని కార్మిక శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వేతనాల్లో పెంపు అవసరమని అధికారులు భావించి తాజా ప్రతిపాదనలు రూపొందించారు. అధ్యక్షుడి ఆమోదం లభించిన వెంటనే ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల ప్రకారం నాలుగు స్థాయిల వేతన వ్యవస్థలో మార్పులు చేయనున్నారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగుల కనీస వేతనాన్ని 34 శాతం, లెవల్-2 ఉద్యోగులకు 52 శాతం, లెవల్-3 వారికి 70 శాతం, లెవల్-4 ఉద్యోగులకు 88 శాతం పెంచాలని నిర్ణయించారు.
వివరాలు
కంపెనీలపై ఆర్థిక భారం
ఈ మార్పులతో హెచ్-1బీ వీసాదారుల సగటు వార్షిక వేతనం సుమారు 14,000 డాలర్ల వరకు పెరగనుంది. దీంతో విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలపై ఆర్థిక భారం పెరుగనుంది. ఈ ప్రతిపాదనలు అమలైతే కంపెనీలు ప్రతి ఏడాది అదనంగా 6.56 బిలియన్ డాలర్ల వేతనాలను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.