GunFire on Flight: రాజధానిలో గ్యాంగ్ వార్.. హైతీలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు
కరేబియన్ దేశం హైతీలో ఓ అమెరికా విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పింది. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో దుండగులు విమానంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి విమానాన్ని మార్గాన్ని మార్చి తప్పించుకున్నారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం సోమవారం ఉదయం ఫ్లోరిడా నుంచి పోర్ట్ ఔ ప్రిన్స్ విమానాశ్రయం చేరుకుంది.
ప్రయాణికులందరూ సురక్షితం
అయితే, అప్పటికే ఈ ప్రాంతంలో గ్యాంగ్ యుద్ధం తీవ్రం అయింది. విమానం 100 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవుతున్నప్పుడు, దుండగులు విమానంపై కాల్పులు జరిపారు. దీంతో, విమానాన్ని వెంటనే డొమినికన్ రిపబ్లిక్‌కు మళ్లించి, అక్కడ ల్యాండ్ చేశారు. ఈ కాల్పుల్లో విమాన సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. కానీ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విమానం డొమినికన్ రిపబ్లిక్‌లో ల్యాండ్ అయిన తర్వాత, దాని వెలుపలి భాగంలో గుచ్చిన బుల్లెట్లు కనిపించాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.