Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో వందల సంఖ్యలతో పౌరులు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 18 వేల మందికి పైగా మరణించారు. గాజాలో హమాస్‌పై యుద్ధంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ గ్రూపు పతనం అంచుకు చేరుకుందని, మిలిటెంట్లు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు చెందిన జబాలియా, షెజయ్య బెటాలియన్లు దాదాపు పతనానికి చివరి దశలో ఉన్నట్లు వివరించారు. లొంగిపోతున్న వారిలో ఈ బెటాలియన్ల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించారు.
గాజాలో త్వరలోనే తమ లక్ష్యాలను సాధిస్తాం: రక్షణమంత్రి
తాము హమాస్‌కు కీలక స్థావరాలైన జబాలియా, షెజాయాలోని కోటలను చుట్టుముట్టామని గాలంట్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో ఏళ్ల పాటు యుద్ధం చేసేందుకు హమాస్ ఈ స్థావరాలను నిర్మించుకున్నట్లు చెప్పారు. ఆ స్థావరాలు నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదన్నారు. అందుకే చాలా మంది హమాస్ మిలిటెంట్లు లొంగిపోతున్నట్లు వివరించారు. ఇటీవలి వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దళాలకు లొంగిపోయారని రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తెలిపారు. ఈ పరిణామమే హమాస్ విచ్ఛిన్నాన్ని సంకేతం అన్నారు. లొంగిపోతున్న వారిలో జబాలియా, షెజయ్య బెటాలియన్ల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించారు. గాజాలో త్వరలోనే తమ లక్ష్యాలను పూర్తవుతాయని, దీంతో యుద్ధం కూడా ముగుస్తుందని గాలంట్ స్పష్టం చేశారు.
హమాస్ చీఫ్‌కు హెచ్చరిక
ఐడీఎఫ్ అరెస్టు చేసిన వారిలో ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడి చేసిన మిలిటెంట్లు కూడా రక్షణ మంత్రి అన్నారు. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను కూడా రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హెచ్చరించాడు. సిన్వార్ కూడా హమాస్‌లోని ఇతర సీనియర్ కమాండర్లకు పట్టిన గతే పడుతుందన్నారు. అతని ముందు రెండే మార్గాలు ఉన్నాయని, ఒకటి లోగింపోవడం, రెండోది మరణించడం తప్పా.. మూడో మార్గం లేదన్నారు. తాను అమెరికా చెప్పే ప్రతి విషయంతో పాటు తమ కేబినెట్ నిర్ణయాలను కూడా పరిగణలోనికి తీసుకుంటానని గల్లంట్ అన్నారు.