
Deportation: చేతులకు సంకెళ్లు,నేలపై పడుకోబెట్టి.. అమెరికా నుంచి బామ్మ డిపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మూడున్నర దశాబ్దాలుగా జీవనం సాగించిన 73 ఏళ్ల సిక్ వృద్ధురాలు హర్జీత్ కౌర్ జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. సాధారణ చెక్‌ఇన్ కోసం వెళ్లిన ఆమెను సెప్టెంబర్ 8న అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు కస్టడీలోకి తీసుకోవడంతో ఆరంభమైన ఈ ఘటన, చివరకు సెప్టెంబర్ 23న ఆమెను ఇండియాకు బలవంతంగా పంపించడంతో ముగిసింది. నిరసనలు, ఆందోళనలు ఈ సమాచారం బయటకు రాగానే స్థానిక సిక్ కమ్యూనిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "బ్రింగ్ గ్రాండ్మా హోమ్" అనే నినాదాలతో వందలాది మంది ర్యాలీల్లో పాల్గొన్నారు. అయితే ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోకుండా అధికారులు ఆమెను డిపోర్ట్ చేశారు.
వివరాలు
కఠినమైన పరిస్థితుల్లో ప్రయాణం
హర్జీత్ కౌర్ న్యాయవాది దీపక్ అహ్లువాలియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమెను ప్రత్యేక విమానంలో పంపించారని, ప్రయాణ సమయంలో మానవత్వానికి విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. మోకాళ్లకు సర్జరీ జరిగిన ఈ వృద్ధురాలికి చేతికి సంకెళ్లు వేసి, నేలపై దుప్పటి వేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు. మందులతో పాటు ఆహారం ఇవ్వమని పలుమార్లు అడిగినా పట్టించుకోలేదని, కేవలం చీజ్ సాండ్‌విచ్ మాత్రమే ఇచ్చారని న్యాయవాది తెలిపారు.
వివరాలు
కుటుంబ సభ్యుల ఆవేదన
హర్జీత్ కౌర్ 1992లో పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళారు. ఇద్దరు కుమారులతో ఒంటరిగా కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. దశాబ్దాల పాటు దుస్తుల దుకాణంలో పని చేశారు. ఐదుగురు మనుమలు, మనుమరాళ్లతో సహా అనేక బంధువులకు ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. 2012లో ఆమె ఆశ్రయం కోసం చేసిన చివరి అప్పీల్ కూడా తిరస్కరించారు. అయినప్పటికీ, 13 ఏళ్లుగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ICE కార్యాలయంలో హాజరు అవుతూ, నిబంధనలు పాటిస్తూ వచ్చారు.
వివరాలు
ప్రజా ప్రతినిధుల స్పందన
ఎల్ సోబ్రాంటే ప్రాంతంలో జరిగిన నిరసనలో స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. "ఆమె ఎలాంటి నేరం చేయలేదు. కేవలం ఒక శాంతియుత వృద్ధురాలు మాత్రమే" అని హర్క్యులీస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు దిల్లీ భట్టరాయ్ పేర్కొన్నారు. "బామ్మను ఇలా వేధించడం అవమానకరం" అని రాష్ట్ర సెనేటర్ జెస్సీ అర్రెగుయిన్ సోషల్ మీడియాలో స్పందించారు. ICE వివరణ ఈ ఘటనపై వస్తున్న విమర్శలకు స్పందించిన ICE అధికారులు.. "హర్జీత్ కౌర్ దశాబ్దాలుగా అనేక కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారు. అన్ని స్థాయిల్లో కేసులు ఓడిపోయారు. 2005లోనే జడ్జి ఆమెను దేశం విడిచిపోవాలని ఆదేశించారు. ఇక చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం" అని స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా సిక్ కమ్యూనిటీ తీవ్ర నిరసన
మొత్తానికి, 73 ఏళ్ల సిక్ బామ్మ హర్జీత్ కౌర్ డిపోర్ట్‌పై అమెరికా సిక్ కమ్యూనిటీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. "ఆమె మన అందరి బామ్మ " అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.