Harsh Goenka: బ్రిక్స్ విందు మెనూ చూసి ఫిదా.. హర్ష్ గొయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందుపై (BRICS Veg Menu Row) సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka) స్పందించారు. శనివారం జరిగిన ఈ విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్‌లో 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని, భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు విందులో కేవలం శాఖాహార వంటకాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
ప్రపంచంలో గొప్ప శాఖాహార వంటకాలు ఉన్నాయి
తాజాగా దీనిపై హర్ష్ గొయెంకా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాఖాహార వంటకాలు భారత్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
అలాంటప్పుడు వాటిని మనం ఎందుకు ప్రదర్శించకూడదని ప్రశ్నించారు. విందులో వడ్డించిన వంటకాల వైవిధ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఇది సాధారణ శాఖాహార మెనూ కాదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన వంటకాలను అందులో చేర్చారని వివరించారు.
గుజరాత్ నుంచి ఖాండ్వి, అవధ్ నుంచి మష్రూమ్ గలౌటీ, కాశ్మీర్ నుంచి గుచ్చి, దక్షిణాది నుంచి పోరియల్, పాత దిల్లీకి చెందిన ఫ్రూట్ క్రీమ్, జిలేబీ వంటి ఎన్నో అద్భుతమైన వంటకాలను మెనూలో చేర్చారని తెలిపారు.
వివరాలు
విందులో పాల్గొనే అవకాశం లభించే బాగుండేది
ఈ విందులో పాల్గొనే అవకాశం తనకు లభిస్తే ఎంత బాగుండేదో అని హర్ష్ గొయెంకా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బ్రిక్స్ విందులో ప్రధాన వంటకాలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రుచులకు చోటు కల్పించారు.
వీటిలో పనీర్ లబాబ్‌దార్, హిమాలయన్ మోరెల్ పుట్టగొడుగులు, ఆస్పరాగస్‌తో చేసిన గుచ్చి మార్మిక్, క్యారెట్-బీన్స్ పొరియల్, తేలికపాటి పప్పు చారు, చిరుధాన్యాల పులావ్, బీట్‌రూట్ రైతా, వివిధ రకాల భారతీయ రొట్టెలు ఉన్నాయి.
చివరగా అతిథులకు డెజర్ట్‌గా జిలేబీతో కూడిన ఓల్డ్ దిల్లీ ఫ్రూట్ క్రీమ్, 'షహతూత్ ఫిర్నీ' వడ్డించారు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన శాఖాహార రుచులతో బ్రిక్స్ విందు మెనూను రూపొందించారు.